అరకొర బస్సులతో ఇబ్బందులు
బత్తలపల్లి: స్థానిక నాలుగు రోడ్ల కూడలి బుధవారం మహిళా ప్రయాణికులతో కిటకిటలాడింది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం అందుకు సరిపడిన బస్సులు అందుబాటులో ఉంచకపోవడంతో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం ఉదయం, సాయంత్రం కూడా ఇదే పరిస్థితి. అనంతపురం, కదిరి, ధర్మవరం, తాడిపత్రి వైపు వెళ్లే వారందరూ కూడలికి చేరుకుని బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. బస్సు రాగానే చుట్టుముట్టేస్తుండడంతో పరిస్థితి గందరగోళానికి దారి తీసింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ప్రయాణికులను దగ్గరుండి బస్సులు ఎక్కించాల్సి వచ్చింది. అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించాలని ఈ సందర్భంగా పలువురు మహిళలు డిమాండ్ చేశారు.
దోమలపై దండయాత్ర కొనసాగించండి
పుట్టపర్తి అర్బన్: దోమలపై దండయాత్రను కొనసాగించాలని ప్రజలకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సునీల్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ దోమల నివారణ దినాన్ని పురస్కరించుకుని బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించి, మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కీటక జనిత వ్యాధులతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దోమలు అధికమైతే మలేరియా, డెంగీ, చికూన్‌గున్యా, ఫైలేరియా తదితర వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా సహాయ అధికారి లక్ష్మీనాయక్, డిప్యూటీ డెమో ఫకృద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.
అరకొర బస్సులతో ఇబ్బందులు


