
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దండి
● సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ
పుట్టపర్తి అర్బన్: మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సీఈఓ వాకాటి కరుణ ఆదేశించారు. వెలుగు కార్యాక్రమాలపై బుధవారం పుట్టపర్తిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఉమ్మడి జిల్లా వెలుగు సిబ్బందితో ఆమె సమీక్షించారు. మహిళా సాధికారతకు కృషి చేయాలని, మహిళా సంఘాల్లో లెక్కల్లో కచ్చితత్వం ఉండేలా కృషి చేయాలని సూచించారు. మహిళల్లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్నారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ తో పాటు ఇతర రుణాలు అందించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో ఉన్నతి హెచ్‌డీ డైరెక్టర్ శివశంకరప్రసాద్, డీఆర్‌డీఏ పీడీలు నరసయ్య, శైలజ, ఉమ్మడి జిల్లా డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. అంతకు ముందు ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ చేతన్‌ను కలసి పుష్పగుచ్చం అందజేసి, మాట్లాడారు.
దేవాలయ భూములను
సంరక్షించాలి
● ఎండోమెంట్ రీజనల్ జాయింట్
కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్
కదిరి టౌన్: దేవాలయ భూములను సంరక్షించాలని సంబంధిత అధికారులను దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశించారు. ఆలయ భూముల అంశంపై జిల్లాతో పాటు వైఎస్సార్ కడప జిల్లా దేవదాయ శాఖ అధికారులతో కదిరిలోని ఎంజీ రోడ్డులో ఉన్న ధ్యాన మందిరంలో డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్‌తో కలసి బుధవారం ఆయన సమీక్షించారు. ఆలయ భూముల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. దేవదాయ పర్యవేక్షాణాధికారి నరసింహరాజు, ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
వ్యక్తి బలవన్మరణం
తనకల్లు: మండలంలోని గుర్రంబైలు నివాసి నాగరాజు (39) ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంతో జీవనం సాగిస్తున్న ఆయనకు ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో బుధవారం టమాట తోటలోని టేకు చెట్టుకు డ్రిప్పు పైప్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు.