
బాలికల భద్రతకు పటిష్ట చర్యలు : ఎస్పీ
పుట్టపర్తి అర్బన్: మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ రత్న పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి విద్యాసంస్థల్లో డ్రగ్స్, ఈవ్‌టీజింగ్, డిజిటల్ అరెస్ట్, శక్తి యాప్, సైబర్ నేరాలపై విద్యార్థులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చెడు మార్గాల వైపు వెళితే జీవితం చిన్నాభిన్నం అవుతుందన్నారు. ర్యాగింగ్‌తో వచ్చే నష్టాలను వివరించారు. డ్రగ్స్ వినియోగంతో ఆరోగ్యం క్షీణిస్తుందని, మానవ సంబంధాలు దెబ్బతింటాయని, చదువులో వెనుకబడతారని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. శక్తి వాట్సాప్ (79934 85111), డయల్ 100, డయల్ 112, చైల్డ్ మ్యారేజెస్ (1098), సైబర్ క్రైమ్ (1930)పై అవగాహన కల్పించారు. ఎవరైనా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ విజయ్‌భాస్కరరెడ్డి, డీఎస్పీ ఆదినారాయణ, ప్రిన్సిపాల్ డాక్టర్ హేమచంద్రారెడ్డి, నోడల్ ఆఫీసర్ గోపీనాథరెడ్డి, సైబర్ క్రైమ్ సీఐ మోహన్, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఈగల్ ఇన్‌చార్స్ శ్రీధర్, సిబ్బంది సుదర్శనరెడ్డి, అశోక్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.