
రైతుల్లో అలజడి
పుట్టపర్తి అర్బన్: తుపాను ప్రభావంతో కురుస్తున్న జడివాన రైతుల్లో అలజడి రేపుతోంది. 15 రోజుల నుంచి రోజూ జడివాన పట్టుకోగా..పంటలకు ఇబ్బందిగా మారింది. ఖరీఫ్‌లో ముందస్తు సాగు చేసిన పంటలు తొలగించే సమయం ఆసన్నం కావడం... జడివాన తెరిపినివ్వకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తుగా సాగు చేసిన వేరుశనగ పంట ప్రస్తుతం పూర్తి కావొచ్చింది. ఇప్పుడు చెట్లు తొలగించక పోతే బూడిద తెగులు వ్యాపించి కాయలు భూమిలోకి పోతాయని, తొలగిస్తే వర్షానికి నాని పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడా పంట తొలగించిన రైతులు తాజా వర్షాలకు వేరుశనగ కట్టె తడిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే పూలు, ఉల్లి, టమాట, ఇతర కూరగాయల పంటలు సాగు చేసిన రైతులు కూడా జడివానతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జడివానతో పూలు కోసేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని, కష్టపడి మార్కెట్‌కు తరలించినా బంతి పూలు రూ.20, రూ.30కి అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.
ఆదుకుంటున్న
గోదాములు..
ఖరీఫ్‌లో ముందస్తుగా రాగి సాగుచేసిన రైతులు పంటను పీకారు. అయితే జడివానతో రాగి కంకులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు అందుబాటులో ఉండటంతో రాగి రైతులు గింజలు ఆరబెట్టడానికి వీటిని ఉపయోగించుకుంటున్నారు. లేకపోతే పంట మొత్తం వర్షార్పణమయ్యేదంటున్నారు. చాలా ప్రాంతాల్లో మాత్రం గోదాముల సౌకర్యం లేక రాగి పంట దెబ్బతింటోంది.
243.6 మి.మీ వర్షపాతం నమోదు..
తుపాను ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ 31 మండలా పరిధిలో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా రామగిరి మండలంలో 15.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఇక కొత్తచెరువు మండలంలో 14.2 మి.మీ, కదిరి 12.2, ఎన్‌పీకుంట 11.4, గుడిబండ 11.2, సోమందేపల్లి 11.2, బుక్కపట్నం 10.2, పుట్టపర్తి 10.2, తాడిమర్రి 9.8, పెనుకొండ 9.2, హిందూపురం 9.2, రొద్దం 8.8, ధర్మవరం 8.4, నల్లచెరువు 8.4, బత్తలపల్లి 8.2, లేపాక్షి 8.2, మిగతా మండలాల్లో 7 నుంచి 2.4 మి.మీ మధ్య వర్షపాతం నమోదైంది. ఈనెలలో మరో రెండు తుపాన్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతుండగా రైతులు ఆందోళన చెందుతున్నారు.
వరుస తుపాన్లతో అన్నదాతల బెంబేలు
చేతికొచ్చిన పంట తొలగించలేక ఇబ్బందులు