
కూటమి పాలనలో అన్ని వర్గాలకూ అన్యాయం
గోరంట్ల: కూటమి పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు..ఆ తర్వాత అందరినీ మోసం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. సోమవారం ఆమె మండల పరిధిలోని నార్శింపల్లి గ్రామంలో ‘‘చంద్రబాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పార్టీ నాయకులు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో ఆచరణకు సాధ్యం కాని హామీలు గుప్పించి గెలిచిన తర్వాత వాటిని అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఇంట్లో చదివే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినా..ఏడాది దాటిన తర్వాత అనేక నిబంధనలు పెట్టి అర్హులకు పథకం అందకుండా కుట్రలు చేశారన్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు రైతులకు అందిస్తామని చెప్పినా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారన్నారు. రెండో ఏడాది అమలు చేసినా కొందరికి రూ.5 వేలు మరికొందరికి రూ.7 వేలు.. ఇలా ఇష్టానుసారం ఇచ్చి చేతులుదులుపుకున్నారన్నారు. ఉచిత సిలిండర్లు కూడా అరకొరే అందించారన్నారు. ప్రతి మహిళకూ ఆడబిడ్డ నిధి కింద నెలకు ఇస్తామన్న రూ.1,500 ఊసే లేకుండా పోయిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కొన్ని బస్సుల్లోనే అదీ 50 కి.మీ పరిమితం చేశారన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలు, నాయకుల గొంతు నొక్కడానికి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు... గెలిచిన తర్వాత చేసిన మోసం గురించి ప్రతి గడపకు వెళ్లి వివరించాలని కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెంకటేశు, జెడ్పీటీసీ సభ్యుడు పాలే జయరాం నాయక్, టౌన్ కన్వీనర్ మేదర శంకర, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రఘురామిరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఆర్.వెంకటరెడ్డి, నార్శింపల్లి సర్పంచ్ లక్ష్మీదేవి, మాజీ సర్పంచులు పెయ్యాల వెంకటశివరెడ్డి, ఆంజనేయులు, పార్టీ ముఖ్యనాయకులు ఫకృద్దీన్ సాహెబ్, బూదిలి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ట్రెజరర్ బాలన్నగారిపల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పధ్మనాభరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు మోసాలను
ప్రజలకు వివరించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్