మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా | - | Sakshi
Sakshi News home page

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా

Aug 6 2025 7:47 AM | Updated on Aug 6 2025 7:47 AM

మంత్ర

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా

2025లో ఇప్పటి వరకు కేసులు – 23

జూలై 23న చెన్నేకొత్తపల్లి మండలం ఎర్రంపల్లి బస్టాప్‌ వద్ద ఆటోల్లో తెచ్చిన రేషన్‌ బియ్యాన్ని లారీల్లోకి మార్చే దృశ్యాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. వాటాల్లో తేడా రావడంతో ముఠాలోని సభ్యులే వీడియోను పోలీసులతో పాటు పలువురికి వాట్సాప్‌ ద్వారా పంపించారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్లే సరికి వాహనాలు లేవు. కానీ నంబర్ల ఆధారంగా ఇప్పటికీ ఆ వాహనాలను గుర్తించలేదు. జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరుడి కనుసన్నల్లో జరిగే దందా కావడంతో పట్టించుకోలేదని సమాచారం.

మే 8వ తేదీన ధర్మవరం నుంచి బెంగళూరు తరలిస్తున్న 4 టన్నుల రేషన్‌ బియ్యాన్ని సోమందేపల్లి జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసి బియ్యం స్వాధీనం చేసుకుని పౌర సరఫరా శాఖ అధికారులకు అప్పజెప్పారు.

జూన్‌ 9వ తేదీన బత్తలపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 750 కిలోల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పలువురి నుంచి కిలో రూ.18 చొప్పున కొనుగోలు చేసిన ఓ వ్యక్తి నిల్వ చేయగా.. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు స్వాధీనం

చేసుకున్నది – 2.41 టన్నులు

సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రేషన్‌ బియ్యం దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. కొందరు నాయకులు మాఫియాగా ఏర్పడి.. రేషన్‌ బియ్యం దందా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. తక్కువ ధరకు పేదల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి పొరుగు రాష్ట్రం కర్ణాటక తరలిస్తూ.. అక్కడ ఎక్కువ ధరలకు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మంత్రులు సవిత, సత్యకుమార్‌ ప్రాతినిథ్యం వహిస్తోన్న పెనుకొండ, ధర్మవరం నియోజకవర్గాల్లో రేషన్‌ బియ్యం దందా మరింత ఎక్కువగా సాగుతోంది.

సిండికేట్‌గా మారి..

రేషన్‌ బియ్యం రూ.కోట్లు కురిపిస్తుండటంతో కూటమి ముఖ్య నేతల అనుచరులు ఇద్దరు సిండికేట్‌గా మారారు. రేషన్‌ దందాలోకి ఎవరూ రాకుండా చక్రం తిప్పుతున్నారు. సోమందేపల్లికి చెందిన ఓ వ్యక్తి.. ధర్మవరం చుట్టుపక్కల కొనుగోలు చేసి రాత్రి వేళల్లో ఎన్‌ఎస్‌ గేటు, పెనుకొండ, కొడికొండ మీదుగా కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ మంత్రి అండదండలు ఉండటంతో పోలీసులు కూడా వాహనాలను పట్టుకోలేని పరిస్థితి. మరో వ్యక్తి కూడా ధర్మవరం సమీప ప్రాంతాల్లో రేషన్‌ బియ్యం సేకరించి కర్ణాటక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. మరికొందరు రేషన్‌ దందాలో తలదూర్చినా..సదరు ముఠా సభ్యులకు కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కమీషన్లు ఇవ్వకుంటే.. మార్గంలో సరుకును పోలీసులకు అప్పజెబుతామని బెదిరింపులకు కూడా దిగుతున్నారని సమాచారం. వారిద్దరి ఆధ్వర్యంలోనే రోజూ లారీ రేషన్‌ బియ్యం హద్దు దాటిపోతున్నట్లు తెలిసింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన రేషన్‌ బియ్యాన్ని ఒక చోట నిల్వ ఉంచి.. పెనుకొండ, సోమందేపల్లి, రామగిరి మీదుగా కర్ణాటక తరలిస్తున్నారు. జిల్లాలోని 16 మండలాలకు కర్ణాటక సరిహద్దు ఉండటంతో రేషన్‌ బియ్యాన్ని సరిహద్దు దాటించడం సులువుగా మారింది. ఈ దందాలో ప్రతి నెలా రూ.3 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఇందులో ఎవరి వాటా వారికి వెళ్లినా.. ఒక్కో వ్యక్తికి సగటున రూ.5 లక్షల వరకు మిగులుతున్నట్లు తెలిసింది.

పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే దాడులు

ధర్మవరం, నల్లమాడ, కొత్తచెరువు ప్రాంతాల నుంచి వచ్చే రేషన్‌ బియ్యం పెనుకొండ, సోమందేపల్లి మీదుగా కర్ణాటక వెళ్తున్నట్లు సమాచారం. పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు మాత్రం పోలీసులు అడపాదడపా అక్కడక్కడా రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ ‘మామూలు’గా వ్యవహారం సాగుతోంది.

రీసైక్లింగ్‌ చేసి అధిక ధరలకు..

రేషన్‌ బియ్యం ముఠాకు కొందరు రేషన్‌ షాపు డీలర్లే లోపాయికారీగా సహకరిస్తున్నట్లు సమాచారం. అనంతరం రేషన్‌ బియ్యం కర్ణాటకలోని మిల్లుల్లో సన్నబియ్యంగా మారి మన మార్కెట్‌లోకి వస్తున్నాయి. రేషన్‌ దందా ఇంత పెద్ద ఎత్తున సాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు ఉన్నాయి. కూటమి నేతలే అక్రమ వ్యాపారులుగా అవతారమెత్తి.. బియ్యం దందాను నడిపిస్తున్నారు. పేదలకు వచ్చే రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ.. కర్ణాటకలో అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రేషన్‌ షాపుల నుంచి నేరుగా నల్లబజారుకు చౌక బియ్యం తరలిపోతున్నట్లు తెలిసింది.

పెనుకొండ, ధర్మవరం కేంద్రాలుగా

రేషన్‌బియ్యం అక్రమ రవాణా

రాత్రివేళ ఆటోలు, ఐచర్‌ వాహనాల్లో తరలింపు

రేషన్‌ బియ్యం మాఫియా వెనుక కూటమి నేతలు!

పేదల బియ్యం సరిహద్దు

దాటిపోతున్నా పట్టించుకోని పోలీసులు

ప్రతి నెలా అక్రమంగా సరిహద్దు దాటుతున్న బియ్యం

– 3 వేల టన్నుల వరకు

ప్రజల నుంచి కొంటున్న ధర కిలోకు

– రూ.17 నుంచి రూ.20 వరకు

గీత దాటితే వేటు తప్పదు

రేషన్‌ బియ్యం దందా ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదు. రేషన్‌ డీలర్లు గీత దాటితే వేటు తప్పదు. రేషన్‌ బియ్యంతో అక్రమ వ్యాపారం చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు. ఎక్కడైనా రేషన్‌ బియ్యం కొనుగోలు చేస్తున్నా.. నిల్వ చేసినా.. సమాచారం చెబితే.. దాడులు చేసి కేసులు నమోదు చేస్తాం.

– వంశీకృష్ణారెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా 1
1/3

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా 2
2/3

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా 3
3/3

మంత్రుల ఇలాకాల్లోనూ రేషన్‌ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement