
కొత్తచీర కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: కళాశాలలో జరిగే ఓ కార్యక్రమానికి కొత్త చీర కొనివ్వలేదని మనస్థాపం చెందిన ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంగళవారం ధర్మవరం పట్టణంలో జరిగింది. టూ టౌన్ ిసీఐ రెడ్డప్ప, విద్యార్థిని తల్లి గట్టు భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని బాలాజీనగర్‌లో నివసిస్తున్న గట్టు భాగ్యలక్ష్మి, గట్టు శ్రీరాములుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె గౌతమి ధర్మవరం రైల్వేస్టేషన్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తోంది. చిన్న కూతురు గట్టు ఉషారాణి(16) స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మగ్గంపై ఆధారపడి జీవించే గట్టు శ్రీరాములు కుటుంబ పోషణకు ఇప్పటికే అప్పులు చేశాడు. పైగా ఇప్పుడు పని కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు తనకు కొత్త చీర కొనివ్వాలని చిన్న కూతురు ఉషారాణి సోమవారం రాత్రి తల్లి భాగ్యలక్ష్మిని అడిగింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి కూడా కొత్త చీర ఎలా అడుగుతావంటూ తల్లి ఆమెను మందలించింది. దీంతో ఉషారాణి ఏడ్చుకుంటూ వెళ్లి పడుకుంది. మంగళవారం ఉదయం శ్రీరాములు బయటకు వెళ్లగా.. తల్లి భాగ్యలక్ష్మి పెద్దకూతురు గౌతమిని రైల్వేస్టేషన్‌లో వదిలిపెట్టేందుకు వెళ్లింది. తిరిగి వచ్చి చూసే సరికి చిన్నకూతురు తలుపులు వేసుకుని లోపల ఉండిపోయింది. ఎంత పిలిచినా పలకక పోవడంతో చుట్టు పక్కలవారిని పిలిచి తలుపులు పగలకొట్టించింది. లోపలకు వెళ్లి చూడగా.. వంట గదిలో ఇనుప తీరుకు ఉషారాణి చీరతో ఉరివేసుకుని నిర్జీవంగా కనిపించింది. వెంటనే ఉషారాణిని కిందకు దించి అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.