
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
● అధికారులకు కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశం
ప్రశాంతి నిలయం: స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అఽధికారులను ఆదేశించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15న స్థానిక పోలీస్ పేరేడ్ మైదానంలో చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ చేతన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ పేరేడ్ గ్రౌండ్‌ను అందంగా ముస్తాబు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను ఆహ్వానించాలన్నారు. ప్రభుత్వ పథకాలపై స్టాళ్లు, శకటాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఉత్తమ సేవలు అందించిన ప్రభుత్వ శాఖల్లోని అధికారులు, ఉద్యోగులను అవార్డులకు ఎంపిక చేసి జాబితాను పంపించాలన్నారు. సమావేశంలో జేససీ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.