
జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు
● 31 మండలాల్లో 29.6 మి.మీ సగటు వర్షపాతం నమోదు
పుట్టపర్తి అర్బన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ తలుపుల తప్ప మిగతా అన్ని మండలాల్లో వర్షం కురిసింది. 31 మండలాల పరిధిలో 29.6 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా గాండ్లపెంట మండలంలో 71.2 మి.మీ, సోమందేపల్లి మండలంలో 56.4 మి.మీ, పుట్టపర్తి మండలంలో 55.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక అగళి మండలంలో 48.6 మి.మీ, పెనుకొండ 48.2, గోరంట్ల 45.2, కదిరి 38.8, మడకశిర 38.8, నల్లచెరువు 38.2, రామగిరి 36.6, బుక్కపట్నం 36.2, సీకేపల్లి 33.6, పరిగి 30.6, లేపాక్షి 30.4, అమరాపురం 29.4, రొళ్ల 29.4, నల్లమాడ 29, తాడిమర్రి 26, హిందూపురం 25.8, రొద్దం 21.6, తనకల్లు 20.8, ధర్మవరం 19.4, చిలమత్తూరు 16.8, గుడిబండ 11.2, కనగానపల్లి 8.2, అమడగూరు 6.6, ఓడీచెరువు 4.2, బత్తలపల్లి 3.4, ఎన్‌పీకుంట మండలంలో 1.6 మి.మీ వర్షపాతం నమోదైంది. తాజా వర్షాలతో అక్కడక్కడా జలకళ సంతరించుకుంది. పెడపల్లి వద్ద కాలువకు వర్షపు నీరు చేరాయి.
మరో ఐదు రోజులు వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులూ ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం 25 మి.మీ, 7న 15.4, 8న 20, 9న 25, 10న 11.5 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావొచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 31.2 – 35 డిగ్రీల మధ్య నమోదవుతాయన్నారు.
పిడుగుపాటుకు
గొర్రెల కాపరి మృతి
మడకశిర రూరల్: పిడుగుపాటుకు ఓ మహిళా గొర్రెల కాపరి మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని ఉప్పార్లపల్లి గ్రామానికి చెందిన రత్నమ్మ(45)తో పాటు ముగ్గురు గొర్రెల కాపరులు జీవాలను మేపుకునేందుకు క్యాంపురం గ్రామ సమీపంలోకి వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ వెంటనే పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో పొలంలో గొర్రెలకు మేత వేస్తున్న రత్నమ్మ సమీపంలోనే ఓ పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. జీవాలపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్న రత్నమ్మ మృతితో ఆ కుటుంబం అండను కోల్పోయింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వం స్పందించి మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.

జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు