
రసాయనిక వ్యర్థాలతో కలుషితమవుతున్న హిందూపురం పారిశ్రామిక
హిందూపురంలోని పారిశ్రామిక వాడలో వెలసిన ఫార్మా కంపెనీల వ్యర్థాలతో ప్రజారోగ్యం ప్రశ్నార్థకంగా మారింది. పరిశ్రమల్లోని విషపూరితరసాయనాల వ్యర్థాలను తరలించే బాధ్యత తీసుకున్న కూటమి నేతలు.. వాటిని ఎక్కడ పడితే అక్కడ డంప్ చేస్తున్నారు. ఫలితంగా భూ ఉపరితలంతో పాటు అంతర్భాగమూ కలుషితమవుతోంది. ఇప్పటికే తాగునీరు కలుషితమై ప్రజలు పలు చర్మ సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు.
సాగునీటి కాలువలో పడేసిన రసాయనిక వ్యర్థాలతో రంగుమారిన భూ ఉపరితలం
నీరు కలుషితం అవుతోంది
ఫార్మా కంపెనీలు ఇష్టారీతిన బయట పడేస్తున్న రసాయన వ్యర్థాలు మా కంపెనీ లోతట్టు ప్రాంతంలోకి చేరుతున్నాయి. చెరువును తలపించేలా రసాయనాలు నిండుకున్నాయి. వేలాదిగా మొక్కలు నాటి పెంచుతున్నాం. ఈ రసాయనాల దెబ్బకు చెట్లు చనిపోతున్నాయి. మా పరిశ్రమలో పనిచేస్తున్న కూలీలు అనారోగ్యానికి గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మా పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించేలా యజమానితో మాట్లాడతాం. – రాకేష్, మేనేజర్,
శ్యామ్ ఫెర్రస్ స్టీల్ పరిశ్రమ, తూముకుంట
చిలమత్తూరు: హిందూపురం రూరల్ మండలం తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామికవాడలోని ఫ్యాక్టరీలలో కెమికల్ వ్యర్థాలను సాగునీటి కాలువల్లో వదిలేశారు. అక్కడితో ఆగకుండా రాత్రి సమయాల్లో ట్యాంకర్ల ద్వారా రసాయనిక వ్యర్థాలను తరలించి బయలు ప్రదేశంలో పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా చెరువులను తలపిస్తోంది. పరిసరాల్లో చెట్లు మాడిపోతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఘాటైన దుర్గంధం వ్యాప్తి చెందడంతో చుట్టుపక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు.
ఆ రెండు పరిశ్రమల్లోనే అత్యధికం..
తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామికవాడలోని రెండు ఫార్మా కంపెనీల నుంచి ఎక్కువగా కెమికల్ వ్యర్థాలు బయటకు వస్తున్నట్లు సమాచారం. వీటిని రీసైక్లింగ్ చేయాల్సిన యాజమాన్యం.. ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికి తోడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిశ్రమల్లోని కెమికల్ వ్యర్థాలను తరలించే బాధ్యతను ఓ టీడీపీ నేత తీసుకున్నారు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.50 వేలు చొప్పున యాజమాన్యాలు చెల్లిస్తున్నట్లుగా సమాచారం. అయితే అధికారం అండ చూసుకుని సదరు నేత కెమికల్ వ్యర్థాలను పక్కనే ఉన్న సాగునీటి కాలువల్లో పారబోస్తుండడంతో ఆ ప్రాంతమంతా చెరువులను తలపిస్తున్నాయి.
కలుషితమవుతున్న భూగర్భ జలం..
తూముకుంట, గోళ్లాపురం పారిశ్రామిక వాడల్లో ఆరు వరకూ కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో ఫార్మా కంపెనీలు అతి పెద్దవి. ఈ పరిశ్రమల నుంచే ఎక్కువగా కెమికల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తోంది. ఆరు బయట పడేసిన రసాయనిక వ్యర్థాలు భూగర్భంలోకి ఇంకడం వల్ల వ్యవసాయ బోర్లు, పంచాయతీ బోరుబావుల్లోని నీరు కలుషితమవుతోంది. ఈ బోరుబావుల్లో నీటిని తాగడం వల్ల పలు చర్మ వ్యాధులతో బాధపడుతూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అయితే ఈ విషయంపై సదరు కంపెనీ ప్రతినిధులను ‘సాక్షి’ నేరుగా కలసి వివరణ కోరగా... ఆ వ్యర్థాలు తమ పరిశ్రమకు చెందినవి కాదని బుకాయించారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని పరిశ్రమల నిర్వాహకులు ఇక్కడకు తెచ్చి పడేస్తున్నారంటూ సమాధానం దాటవేశారు.
చర్యలు చేపడతాం
రసాయన వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఉపేక్షించం. ఇరిగేషన్ కాలువల్లో వ్యర్థాలను పారబోస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై విచారణ చేపడతాం. శ్యాంపిల్స్ సేకరించి చర్యలు తీసుకుంటాం. ఫార్మా కంపెనీల ఆగడాలను అడ్డుకుంటాం.
– మునిప్రసాద్, ఈఈ, పొల్యూషన్ బోర్డు, అనంతపురం
చెరువులను తలపిస్తున్న ఫార్మా వ్యర్థాలు
పట్టించుకోని అధికారులు

రసాయనిక వ్యర్థాలతో కలుషితమవుతున్న హిందూపురం పారిశ్రామిక