
మామిళ్లకుంట క్రాస్‌లో ‘గ్రీవెన్స్’ భవనం
పుట్టపర్తి అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా స్థాయి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్) కోసం నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. పుట్టపర్తి మండలంలోని మామిళ్లకుంట క్రాస్‌లో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టిన నూతన భవన నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో నిర్వహిస్తుండగా జిల్లా నలుమూలల నుంచి జనం తరలిరావడం.. వివిధ సమస్యల పరిష్కారానికి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలెక్టరేట్ ఎదుటే సోమవారం ధర్నా నిర్వహిస్తుండటంతో పట్టణవాసులతో పాటు ప్రశాంతి నిలయం వచ్చే సత్యసాయి భక్తులకు, సత్యసాయి జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యపై ఇప్పటికే సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌కు, జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
వేదిక మార్పునకు నిర్ణయం
కలెక్టరేట్ వద్ద ప్రతి సోమవారం నిర్వహించే నిరసన కార్యక్రమాల వల్ల కలుగుతున్న ఇబ్బందులను గుర్తించిన కలెక్టర్ చేతన్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమ నిర్వహణను కలెక్టరేట్‌లో కాకుండా మరోచోటకు మార్చాలని నిర్ణయించారు. ఇందుకోసం మామిళ్లకుంట క్రాస్‌లో ప్రశాంతి రైల్వే స్టేషన్ పక్కన సెరికల్చర్ కార్యాలయానికి సంబంధించిన ఎకరా విస్తీర్ణంలోని భూమిని సేకరించారు. అనంతరం రూ.80 లక్షల వ్యయంతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణానికి టెండర్ పిలవగా... ధర్మవరానికి చెందిన ఓ కంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. ఈ నూతన భవనంలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చే ప్రజలు వేచి ఉండడానికి విశాలమైన హాలు, కలెక్టర్ విశ్రాంతి గది నిర్మిస్తున్నారు. అలాగే 50 మంది అధికారులు కూర్చునేందుకు వీలుగా వేదిక, 300 మందికిపైగా ప్రజలు కూర్చునేందుకు వీలుగా హాలు, మరుగుదొడ్లు, ర్యాంప్ సిద్ధమవుతున్నాయి. ఆగస్టు నాటికి భవనం అందుబాటులోకి వస్తుందని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచే నూతన భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాలని యంత్రాంగం భావిస్తోంది.
రూ.80 లక్షల వ్యయంతో నిర్మాణం
నెలరోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం