
ఓర్వలేకే అక్రమ అరెస్టులు
● కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ
జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ ధ్వజం
పెనుకొండ రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణ కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ విమర్శించారు. కుట్రలు పన్ని పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా జగన్‌ను ఒంటరి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ పర్యటనలకు ప్రజలు పోటెత్తుతుండటంతో కూటమి నేతల్లో భయం పట్టుకుందన్నారు. అందుకే కుట్రలు పన్ని ఓఎస్‌డీ కృష్ణమోహన్, ధనుంజయరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను అరెస్ట్ చేశారన్నారు. లేని మద్యం కుంభకోణాన్ని సృష్టించి అక్రమ అరెస్టులకు తెరలేపారన్నారు. గతంలో కూటమి నాయకులు ఒకసారి రూ.50 వేల కోట్ల కుంభకోణం అని, తర్వాత రూ.30 వేల కోట్లు అని, ఇప్పుడు రూ.18 వేల కోట్లు.. రూ.2 వేల కోట్ల స్కాం అని అంటున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు, అక్రమ అరెస్ట్‌లను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారన్నారు. పొంతనలేని మాటలతో కూటమి నాయకులు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. ఎటువంటి ఆధారాలూ లేకుండా అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నియంత్రణతో మద్యం అమ్మకాలు చేపట్టిందన్నారు. నేడు ప్రతి గల్లీలోనూ బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు చేస్తున్నారన్నారు. అసలైన విచారణ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద సిట్ అధికారులతో చేయించాలన్నారు. లేని మద్యం కుంభకోణం నుంచి ఎంపీ మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని స్పష్టం చేశారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
ప్రశాంతి నిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేయాలని సూచించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. అర్జీదారులు తమ ఆధార్‌కార్డును తప్పని సరిగా వెంట తీసుకురావాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో పొగతాగిన ఐదుగురికి జరిమానా
హిందూపురం: స్థానిక రహమత్ సర్కిల్ వద్ద బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తున్న ఐదుగురికి రెండో పట్టణ సీఐ అబ్దుల్ కరీం జరిమానా విధించారు. ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా విధించారు. బహిరంగంగా పొగతాగడం, పాన్‌మసాలు తింటూ ఉమ్మి వేయడం వంటివి నిషేధమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.

ఓర్వలేకే అక్రమ అరెస్టులు