బది‘లీలల’పై హైకోర్టుకు.. | - | Sakshi
Sakshi News home page

బది‘లీలల’పై హైకోర్టుకు..

Jul 21 2025 8:09 AM | Updated on Jul 21 2025 8:09 AM

బది‘లీలల’పై హైకోర్టుకు..

బది‘లీలల’పై హైకోర్టుకు..

అనంతపురం అర్బన్‌: కూటమి ప్రభుత్వ పాలనలో న్యాయం అందని ద్రాక్షగా మారింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా యంత్రాంగంపై స్వారీ చేస్తున్నారు. అధికారులు కూడా వారికి దాసోహమై... విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసులకు తలొగ్గి నిబంధనలకు తుంగలో తొక్కి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ తప్పిదాలు చివరికి అధికారుల మెడకే చుట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇటీవల నిర్వహించిన సచివాలయ ఉద్యోగుల బది‘లీలల్లో’ సరిగ్గా ఇదే జరిగింది. బదిలీల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందంటూ సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో రాష్ట్రస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారులను బాధ్యులను చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఖాతరు చేయని వైనం..

వ్యవసాయ శాఖ పరిధిలోని సచివాలయ అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియను గత నెల 28న అధికారులు నిర్వహించారు. ఈనెల ఒకటో తేదీన బదిలీల ఉత్తర్వులు జారీచేశారు. ప్రక్రియలో అధికారులు నియమ, నిబంధనలు పాటించకపోవడం ద్వారా తొలి ర్యాంకులో ఉన్న తమకు అన్యాయం జరిగిందని పలువురు ఆరోపించారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ సుస్మితది ఉమ్మడి జిల్లాలో 5వ ర్యాంక్‌, శ్రీ సత్యసాయి జిల్లాలో 2వ ర్యాంక్‌. జనార్దన్‌కు ఉమ్మడి జిల్లాలో 6వ ర్యాంక్‌, శ్రీ సత్యసాయి జిల్లాలో 3వ ర్యాంక్‌. ఇక శిరీషకు పీహెచ్‌ కోటా అమలు కాలేదు. ఇలా అర్హులైన పలువురు బదిలీల్లో వారు పెట్టుకున్న ఆప్షన్‌ స్థానాలు ఖాళీగా ఉన్నా ఇవ్వకుండా తరువాతి ర్యాంక్‌ వాళ్లకు ఇచ్చారని ఆరోపించారు. ఒక్క అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల విషయంలోనే కాదు... సచివాలయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ప్రజాప్రతినిధుల సిఫారసులకు అధికారులు పెద్దపీట వేసి నిబంధనలు తుంగలో తొక్కారనే ఆరోపణలు వచ్చినా ఖాతరు చేయలేదు.

కలెక్టర్‌ను కలిసినా అంతే...

బదిలీల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ను బాధిత అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు ఈనెల 2న కలిసి ఆధారాలతో సహా వినతిపత్రం అందజేశారు. విచారణ చేస్తామని కలెక్టర్‌ చెప్పి పంపించారు. అటు తరువాత కూడా కలెక్టర్‌ను అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు మూడు, నాలుగు దఫాలు కలిసి తమ గోడు చెప్పుకుని న్యాయం చేయాలని కోరారు. అయితే వారి గోడును ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. దీంతో న్యాయం కోసం 11 మంది అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు హైకోర్టును ఆశ్రయించారు.

అధికారులను బాధ్యుల్ని చేస్తూ...

బదిలీల ప్రక్రియలో తమకు జరిగిన అన్యాయానికి అధికారులను బాధ్యులను చేస్తూ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లు కె.హరినాథ్‌రెడ్డి, హెచ్‌.జహీర్‌, జె.రేణుకా, ఎం.సుస్మిత, కె.జనార్దన్‌, వి.తరుణ్‌రెడ్డి, బి.శిరీష, కడపల రజిత, బీఏ సంధ్య, పి.నేత్ర, జి.సర్‌తాజ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ (17050 ఆఫ్‌ 2025) వేశారు. గ్రామ సచివాలయ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో పాటు 19 మంది అగ్రికల్చర్‌ అసిస్టెంట్లను బాధ్యులను చేశారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు వేసిన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు ఇంటీరియం ఆర్డర్‌ ఆఫ్‌ స్టేటస్‌కో ఈనెల 16న ఇచ్చింది. ఆ రోజు నుంచి రెండు వారాల పాటు స్టేటస్‌కో కొనసాగించాలని అధికారులను ఆదేశించడం గమనార్హం.

కోర్టు మెట్లెక్కిన సచివాలయ ఉద్యోగులు

కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించినా ప్రయోజనం శూన్యం

హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన

అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు

స్టేటస్‌కో ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement