
సమష్టి కృషితోనే ప్లాస్టిక్ రహిత సమాజం
ధర్మవరం అర్బన్: సమష్టి కృషితోనే ప్లాస్టిక్ రహిత సమాజం సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకారం అందించాలని కోరారు. శనివారం పట్టణంలో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రజలతో కలిసి నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ చేతన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కాలేజీ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మానవాళి మనుగడకు ప్లాస్టిక్‌ను నిర్మూలించడం ఎంతో ముఖ్యమన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లకు బదులుగా జూట్ బ్యాగులు వినియోగించాలని సూచించారు. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగు వెంట తీసుకువెళ్లాలన్నారు. వ్యాపారులు కూడా ప్లాస్టిక్ కవర్లకు బదులు జూట్, క్లాత్ బ్యాగులను వినియోగదారులకు ఇవ్వాలన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనలో భాగంగా జూట్ బ్యాగులు, స్టీల్ వాటర్ బాటిల్స్ వినియోగంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా అందరితో స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. స్వచ్ఛతా కార్మికులు పుల్లన్న, కాటమయ్యను కలెక్టర్ శాలువాలతో సన్మానించారు. అనంతరం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన బటర్ ఫ్లై పార్కు, రైల్వేస్టేషన్ రోడ్డులోని మున్సిపల్ పార్కులను కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, తహసీల్దార్ సురేష్‌బాబు, మున్సిపల్ టీపీఓ పెనుబోలు విజయభాస్కర్, మెప్మా సీఓలు, ఆర్‌పీలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై
ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలి
‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ ర్యాలీలో
కలెక్టర్ టీఎస్ చేతన్ పిలుపు

సమష్టి కృషితోనే ప్లాస్టిక్ రహిత సమాజం