
హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్
హిందూపురం: హత్యాయత్నం కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన నరసింహులు ఈ నెల తొమ్మిదో తేదీన ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా మలుగూరు గ్రామం వద్ద వెనుకనుంచి వచ్చిన నలుగురు వ్యక్తులు కత్తితో తలపై దాడిచేశారు. గాయపడిన నరసింహులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు హిందూపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కింద కేసు నమోదైంది. కేసులో నిందితులైన పోలేపల్లికి చెందిన శ్రీనివాసులు, చిన్న అంజినప్ప, హిందూపురం నేతాజీనగర్‌కు చెందిన సాయివినయ్, త్యాగరాజనగర్‌కు చెందిన నాగేష్‌ను శనివారం మలుగూరు రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేసినట్లు సీఐ ఆంజనేయులు చెప్పారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే దాడి చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంిపినట్లు తెలిపారు.
లింకు నొక్కితే..
రూ.2.35 లక్షలు మాయం
కొత్తచెరువు: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. లింకులు పంపించి.. అవతలి వ్యక్తి నొక్కగానే.. ఫోన్‌ను హ్యాక్ చేసి.. బ్యాంకు ఖాతాల నుంచి నగదు దోచేస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కదిరేపల్లికి చెందిన టి.నాగభూషణ, గాయత్రి దంపతులు. వీరిద్దరి బ్యాంకు ఖాతాలకు ఒకే ఫోన్ నంబర్ లింక్ అయ్యింది. ఈ క్రమంలో నాగభూషణ ఫోన్‌కు ఈ నెల ఏడో తేదీన గుర్తు తెలియని నంబర్ నుంచి లింకు వచ్చింది. ఆ లింకును ఆయన నొక్కగానే ఫోన్‌ను హ్యాక్ అయ్యింది. ఆ తర్వాత నుంచి నాగభూషణ సెల్‌లో ఫోన్ పే పనిచేయలేదు. వారం రోజుల తర్వాత బ్యాంకు వెళ్లి ఆరా తీయగా నాగభూషణ, గాయత్రి ఖాతాల నుంచి మొత్తం రూ.2,35,000 కట్ అయినట్లు చెప్పారు. దీంతో సైబర్ మోసం జరిగిందని గ్రహించిన బాధితుడు శనివారం కొత్తచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్లాస్టిక్ నిర్మూలనతో
పర్యావరణ పరిరక్షణ
● బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పిలుపు
పెనుకొండ: ప్లాస్టిక్‌ను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకుందామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళీ శాఖ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం పెనుకొండ పట్టణంలో విద్యార్థులు, అధికారులు, పట్టణ ప్రజలతో కలసి మంత్రి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలని, పేపర్ బ్యాగ్‌లను వాడాలని కోరారు. పర్యావరణ సమతుల్యత లోపించకుండా జాగ్రత్త వహించాలన్నారు. అనంతరం గాంధీ సర్కిల్లో మానవహారం నిర్వహించారు.

హత్యాయత్నం కేసులో నలుగురి అరెస్ట్