
పాత వాహనాలపై పచ్చ కన్ను
సాక్షి టాస్క్‌ఫోర్స్: దౌర్జన్యం చేయడం, దోచుకోవడం టీడీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం ఉందన్న ధైర్యంతో అందిన వచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకునే టీడీపీ నేతలు..చివరకు పాత సామగ్రి కోసం పోటీపడుతున్నారు. ఇందుకోసం ముఖ్య నాయకుడి వద్దే పంచాయితీ పెట్టారు. ‘తమ్ముళ్ల’ నిసిగ్గు వ్యవహారం బయటకు పొక్కితే పరువుపోతుందని భావించిన సదరు నాయకుడు ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగించారు.
తుక్కు వాహనాల కోసం పోటీ
పుట్టపర్తి ప్రాంతంలో పదేళ్ల క్రితం హంద్రీ–నీవా రెండో దశ కాలువ పనులను పల్లవి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ చేపట్టింది. పనులు పూర్తయ్యాక మరమ్మతుకు గురైన హిటాచీ, టిప్పర్లను బుక్కపట్నం మండలం కింకిరివాండ్లపల్లి వద్ద ఉంచేసింది. ఆ తర్వాత వాటి గురించి సదరు సంస్థ మరచిపోయింది. ఈలోపు వాహనాలన్నీ తుప్పుపట్టిపోయాయి. ప్రస్తుతం గుజిరీకి విక్రయించేందుకు తప్ప ఎందుకూ పనికి రావు. అయితే ఈ వాహనాలు గుజిరీకి విక్రయించినా రూ.50 లక్షల దాకా వచ్చే అవకాశం ఉండటంతో స్థానిక టీడీపీ నాయకులు కన్నేశారు. గుట్టుగా తరలించి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. అయితే.. టీడీపీలోనే మరో వర్గం వారు తమకూ భాగం కావాలని పట్టుబట్టడంతో వివాదం రేగింది.
అడ్డుకున్న ‘తమ్ముళ్లు’
టీడీపీ నేతలు తమ వాహనాలను తుక్కు కింద విక్రయించేందుకు సిద్ధమైన విషయం తెలుసుకున్న పల్లవి కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు వాటిని తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితం వచ్చారు. నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి పోలీసుల సాయంతో వాహనాలు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే అప్పటికే వాటిపై కన్నేసిన టీడీపీ నాయకులు తమకు కనీసం కమీషన్ అయినా ఇవ్వాలని పట్టుబట్టారు. అందుకు సంస్థ ప్రతినిధులు అంగీకరించకపోవడంతో నానా యాగీ చేసి వాహనాల తరలింపును అడ్డుకున్నారు.
పంచాయితీ చేసిన ముఖ్యనేత
టీడీపీ నేతల దిగజారుడు వ్యవహారం తెలుసుకున్న ‘ముఖ్య నేత’..ఈ విషయం ప్రజలకు తెలిస్తే పరువుపోతుందని భావించారు. వెంటనే టీడీపీ నాయకులను, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలను ఎవరూ తరలించవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో ప్రస్తుతానికి ‘పాత వాహనాల పంచాయితీ’కి బ్రేక్ పడింది.
పదేళ్ల క్రితం హంద్రీ–నీవా పనులు
పూర్తయ్యాక వాహనాలు వదిలేసి వెళ్లిన కన్‌స్ట్రక్షన్ సంస్థ
గుజిరీకి విక్రయించేందుకు
‘తమ్ముళ్ల’ యత్నం
వాటిని కంపెనీ ప్రతినిధులు తీసుకెళ్లకుండా అడ్డుకున్న వైనం

పాత వాహనాలపై పచ్చ కన్ను