
పీఆర్సీని ప్రకటించాలి
ధర్మవరం అర్బన్: తక్షణమే 12వ పీఆర్సీని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎస్ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిపి జయచంద్రారెడ్డి, కె.మనోహర్ డిమాండ్ చేశారు. ధర్మవరంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కమిషన్ ఏర్పాటు ఆలస్యమయ్యే పక్షంలో ఉద్యోగులకు 30శాతం మద్యంతర భృతి ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని, ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. మెమో 57 ప్రకారం సెప్టెంబర్ 2004కు ముందు నియామకమైన 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు లక్ష్మయ్య, అమర్‌నారాయణరెడ్డి, బిల్లే రామాంజనేయులు, సకల చంద్రశేఖర్, పెద్దకోట్ల సురేష్, కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.
ఖాద్రీ ఆలయానికి పోటెత్తిన భక్తులు
కదిరి టౌన్: ఓం నమో నరసింహ...అంటూ గోవింద నామస్మరణతో ఖాధ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారి జన్మదినం స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని విశేషంగా అలంకరించారు. స్వామి కాపులు తలనీలాలు సమర్పించారు. మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదానం జరిగింది.
ముందుగానే ‘నైరుతి’
అనంతపురం అగ్రికల్చర్: నైరుతి రుతుపవనాలు (సౌత్‌వెస్ట్రన్ మాన్‌సూన్స్) ఈ సారి ముందుగానే పలకరించే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 27న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే పరిస్థితి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్‌మెంట్) ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో వాతావరణం అనుకూలిస్తే ఉమ్మడి జిల్లాలో జూన్ ఒకటి, రెండో తేదీల్లోనే ప్రవేశించవచ్చని అంచనా వేస్తున్నారు. 2020లో జూన్ ఒకటిన నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. 2021లో జూన్ 3, 2022లో మే 29, 2023లో జూన్ 8, 2024లో మే 30న ప్రవేశించాయి. ఈ సారి మే 31న తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేయగా... తాజాగా నాలుగు రోజులు ముందుగానే మే 27నే పలకరించవచ్చని ప్రకటించడం విశేషం. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా ముందుగానే ‘నైరుతి’ పలకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రుతుపవనాల ప్రవేశంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తాయి.
ఖరీఫ్‌కు కీలకం..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో సాగయ్యే లక్షలాది హెక్టార్ల పంటలకు నైరుతి ప్రభావంతో కురిసే వర్షాలే ఆధారం. జూన్–సెప్టెంబర్ మధ్య నాలుగు నెలల కాలంలో 319.7 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉంటుంది. జూన్‌లో 61 మి.మీ, జూలైలో 63.9, ఆగస్టులో 83.8, సెప్టెంబర్‌లో 110.9 మి.మీ మేర వర్షపాతం నమోదు కావాలి. నాలుగు నెలల కాలంలో 30 నుంచి 40 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావొచ్చని, విస్తారంగా వర్షాలు కురిస్తే ఖరీఫ్ సాగు ఊపందుకుంటుందని చెబుతున్నారు.