
అంగరంగ వైభవం.. లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
ధర్మవరం అర్బన్: లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మ రథోత్సవం శనివారం వైభవంగా జరిగింది. 11రోజులపాటు సాగే బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది బ్రహ్మ రథోత్సవం. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలు గజ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ తేరుబజారుకు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి కొలువుదీరారు. ఉదయం 7 గంటలకు మడుగుతేరు(రథోత్సవం)కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అనంతరం రథానికి పూజలు చేసి మడుగుతేరు లాగారు. ప్రధాన అర్చకులు కోనేరాచార్యులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వేలాది మంది భక్తులు రథం వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 4 గంటలకు బ్రహ్మ రథోత్సవం మొదలైంది. తేరుబజార్ నుంచి అంజుమన్ సర్కిల్ వరకు అశేష భక్తజన సందోహం నడుమ రథం ముందుకు కదిలింది. భక్తులు గోవింద నామస్మరణతో పురవీధులు ప్రతిధ్వనించాయి. సాయంత్రం 6గంటలకు ధూళోత్సవం నిర్వహించారు.
గోవింద నామస్మరణతో పులకించిన ధర్మవరం అశేష భక్తజన సందోహం నడుమ కదిలిన బ్రహ్మరథం
పటిష్ట పోలీసు బందోబస్తు
రథోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో డీఎస్పీ హేమంత్‌కుమార్, వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్, టూటౌన్ సీఐ రెడ్డప్ప, శివరాముడు, శ్యామరావు, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, పోలీసులు సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జేబుదొంగలున్నారు అంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అల్లరి మూకలను చెదరగొడుతూ ఉత్సవం ప్రశాంతంగా సాగేలా చూశారు.

అంగరంగ వైభవం.. లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం

అంగరంగ వైభవం.. లక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం