
దేశ రక్షణకు ముస్లింలంతా సిద్ధం
హిందూపురం టౌన్: ‘ఆపరేషన్ సిందూర్’కు బాసటగా భారతదేశ రక్షణకు ముస్లింలంతా ప్రాణత్యాగాలకు సిద్ధంగా ఉన్నామని ముస్లిం ఐక్య వేదిక నాయకులు ప్రకటించారు. శనివారం పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో అఖిల భారత షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ అధ్యక్షతన ‘ఆపరేషన్ సిందూర్’కు సంఘీభావంగా గోరంట్ల మండలం కళ్లీతండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన నేపథ్యంలో సంతాప సభ నిర్వహించారు. ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ పాకిస్తానీ తీవ్రవాదుల అమానుష మారణ కాండను ప్రపంచం అసహ్యించుకుంటోందన్నారు. మహమ్మద్ ప్రవక్త యుద్ధ నీతులలో బాటసారులు, వృద్ధులు, పసిపిల్లలు, మహిళలు, చెట్లు, నీటి ఊటలపై దాడి చేయకూడదని సందేశాన్నిస్తే.. పాకిస్తానీ దుర్మార్గులు నిరాయుధులైన టూరిస్టులపై దాడి చేసి మానవత్వాన్ని మంటగలపారన్నారు. మౌలానా అబ్దుల్ మాలిక్, మౌలానా ఉస్మాన్ ఘని తదితరులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు, జాతీయ సమైక్యత, దేశ సుస్థిరత, దేశ అభివృద్ధి కోసం దేశంలోని ముస్లిం సమాజం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ దేశం వైపే ఉంటుందని, ఎలాంటి త్యాగాలకు నైనా ముస్లిం సామాజిక వర్గం సిద్ధమని అన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి సద్భావన సర్కిల్‌లో జవాన్ మురళీనాయక్ చిత్ర పటానికి అశ్రునివాళి అర్పించారు. కార్యక్రమంలో జామియా మసీదు సభ్యులు బాబా, హ్యూమనిజం అజంతుల్లా ఖాన్, 313 ముజీబ్, హజ్ కమిటీ సభ్యుడు డైమండ్ బాబా, మౌలానా సాజిద్, ఎస్‌డీపీఐ జిల్లా నాయకులు అంజాద్, ముజ్జు, మైనారిటీ నాయకులు అమానుల్లా పాల్గొన్నారు.