
రేషన్ బియ్యం స్వాధీనం
చెన్నేకొత్తపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మంగళవారం సీకేపల్లి మండలం ప్యాదిండి గ్రామం వద్ద స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. ధర్మవరం వైపు నుంచి బొలెరో వాహనంలో కర్ణాటకకు 47 కిలోల బరువున్న 57 ప్యాకెట్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.
కులగణన సక్రమంగా జరిగితే ప్రజలకు సమ న్యాయం
● కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు
రఘువీరా
మడకశిర రూరల్: కేంద్ర ప్రభుత్వం కులగణన సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు సమ న్యాయం జరిగే అవకాశం ఉంటుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మడకశిర మండలం నీలకంఠాపురంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం కులగణనపై కార్యాచరణ ప్రకటించాలన్నారు. దాని ఫార్మెట్ తయారీపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు లోకసభ, రాజ్యసభల్లో చర్చించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కులగణన సర్వే ఆరు నెలల్లోనే పూర్తి చేసి వివరాలు ప్రకటించాలన్నారు. కాంగ్రెస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఒత్తిడి తేవడంతోనే కులగణనకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఈ సర్వేను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కులగణన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేసేలా చూడాలన్నారు. కులగణన పూర్తయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సీట్లు పెరిగి న్యాయం జరుగుతుందన్నారు.
అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు
ధర్మవరం అర్బన్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ధర్మవరంలోని సత్యసాయినగర్‌కు చెందిన విజయలక్ష్మిని అదనపు కట్నం కోసం భర్త రవికుమార్, అత్త లక్ష్మీదేవి, మామ పెద్దన్న, ఆడపడుచు పద్మావతి, మరిది పెద్దన్న వేధిస్తున్నారని బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
వేధింపులపై కేసు నమోదు..
స్థానిక తారకరామాపురానికి చెందిన షేక్ మహమ్మద్ వలి, తల్లి జుబేదా, తండ్రి ఫకృద్దీన్, తమ్ముళ్లు మసూద్‌వలి, జిలాన్‌పై వేధింపుల కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డప్ప తెలిపారు. తనను తరచూ వారు వేధిస్తున్నారంటూ మహమ్మద్ వలి భార్య షేక్ నఫ్రాసి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా జైలులో 9న
మామిడి ఫలసాయం వేలం
బుక్కరాయసముద్రం: మండలంలోని జిల్లా ఓపెన్ ఎయిర్ జైల్లో ఈ నెల 9న ఉదయం 10.30 గంటలకు మామిడి తోటల ఫలసాయాన్ని బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఓపెన్ ఎయిర్ జైలు సూపరింటెండెంట్ కాంతారాజ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3,544 మామిడి చెట్లకు కాసిన కాయలకు కడప రేంజ్ ప్రాంతీయ జైళ్ల ఉపశాఖ అధికారి సమక్షంలో వేలం నిర్వహిస్తామరు. వేలంలో పాల్గొనేవారు రూ.లక్ష డిపాజిట్ చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్న రైతులు, వ్యాపారులు వేలంలో పాల్గొనాలని ఆయన సూచించారు.
9కి వేలం వాయిదా..
బుక్కరాయసముద్రం మండలంలోని అనంతపురం జిల్లా జైల్లో ఈ నెల 8న జరగాల్సిన వేలం 9వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసినట్లు సూపరింటెండెంట్ రహ్మాన్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 25వేల కిలోల వేరు శెనగ చెక్కకు వేలం నిర్వహిస్తామన్నారు. వేలంలో పాల్గొనేవారు రూ.20 వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా
గుంతకల్లు రూరల్: మండలంలోని తిమ్మాపురం సమీపంలో ఉన్న పద్మావతి ఆయుర్వేదిక్ కళాశాల వద్ద బళ్లారి వైపు వెళుతున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తాపడింది. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తాపడింది. ఘటనలో 33 కేవీ విద్యుత్ లైన్‌కు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభంతో పాటు దానికి సపోర్ట్‌గా నిలిపిన మరో స్తంభమూ కూలింది. విద్యుత్ వైర్లు కిందకు వేలాడాయి. స్థానికులు అప్రమత్తమై సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ప్రమాదంలో గాయపడిన ట్యాంకర్ డ్రైవర్ అంజాద్‌బాషాను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

రేషన్ బియ్యం స్వాధీనం

రేషన్ బియ్యం స్వాధీనం