నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తాం : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తాం : ఎస్పీ

May 31 2024 12:28 AM | Updated on May 31 2024 12:28 AM

నింది

నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తాం : ఎస్పీ

ధర్మవరం అర్బన్‌: హిందూపురానికి చెందిన యువ న్యాయవాది సంపత్‌కుమార్‌ను హత్య చేసిన కేసులో నిందితులను త్వరితగతిన అరెస్ట్‌ చేస్తామని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. గురువారం ధర్మవరం చెరువు సమీపంలో పడేసిన సంపత్‌కుమార్‌ మృతదేహాన్ని ఆయన పరిశీలించి, మాట్లాడారు. హతుడు సైతం పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, ఆయనపై కౌంటర్‌ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో హతుడికి ఎవరెవరితో శత్రుత్వం ఉందో కుటుంబసభ్యుల ద్వారా తెలుసుకుంటామన్నారు. విచారణ పక్కాగా చేపట్టి సరైన ఆధారాలతో నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తామన్నారు. ఇందు కోసం ప్రత్యేక బృందాలను రంగంలో దించినట్లు వివరించారు.

యువకుడి బలవన్మరణం

తాడిమర్రి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన మేరకు... తాడిమర్రిలోని ఎస్సీ కాలనీకి చెందిన సాకే తిరుపాల్‌, నారాయణ దంపతుల కుమారుడు రాము అలియాస్‌ రామ్మోహన్‌ (30)కు ఎనిమిదేళ్ల క్రితం రామగిరి మండలం గంతిమర్రికి చెందిన ప్రమీలతో వివాహమైంది. ట్రాక్టర్‌ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రాము మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ దంపతుల మధ్య గొడవ చేసుకుని భార్య పుట్టింటికి వెళుతుండేది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న రాము రాత్రి 7.30 గంటలకు క్షణికావేశంలో పురుగుల మందు తాగి ఖాళీ డబ్బాను భార్యకు చూపించాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం రాత్రి 10.30 గంటలకు అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక రాత్రి 1.30 గంటలకు రాము మృతి చెందాడు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.

ట్రాక్టర్‌ బోల్తా – ఒకరి మృతి

రాయదుర్గం టౌన్‌: ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తాపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం భైరవానితిప్ప గ్రామానికి చెందిన వీరేష్‌ (30)కు భార్య, ఏడాదిన్నర వయసున్న కుమారుడు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగించే వీరేష్‌... అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ క్యాతప్పతో కలసి గురువారం ఉదయం విద్యుత్‌ స్తంభాలను తీసుకెళ్లేందుకు రాయదుర్గం వచ్చాడు. విద్యుత్‌ స్తంభాలను ట్రాక్టర్‌లో లోడు చేసుకుని తిరుగు ప్రయాణంలో గుమ్మఘట్ట మండలం పూలకుంట వద్దకు చేరుకోగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో బోల్తాపడింది. విద్యుత్‌ స్తంభాలు మీదపడడంతో వాటి మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. స్థానికులు గుర్తించి క్షతగాత్రులను కాపాడి వెంటనే 108 అంబులెన్స్‌ ద్వారా రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో పరిస్థితి విషమించి వీరేష్‌ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తాం : ఎస్పీ 1
1/1

నిందితులను త్వరలో అరెస్ట్‌ చేస్తాం : ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement