
డీఎస్పీ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ
హిందూపురం అర్బన్: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ మాధవరెడ్డి పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఆయన స్థానిక డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు. ఎన్‌డీపీఎస్ కేసుల దర్యాప్తులో వేగం పెంచాలన్నారు. స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, క్రమం తప్పకుండా వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఎన్నికలు నేపథ్యంలో ఫ్యాక్షన్ గ్రామాలపై దృష్టి సారించాలన్నారు. అల్లర్లకు కారణమయ్యే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. అలాగే వాహన తనిఖీలు నిరంతరం చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. గ్రేవ్ కేసుల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తగిన ఆధారాలతో ముద్దాయిలకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా స్థావరాలపై పోలీసులు, సెబ్ అధికారులు నిరంతరం దాడులు చేస్తూ సమూలంగా నిర్మూలించాలన్నారు. కర్ణాటక నుంచి మద్యం ప్రవేశించకుండా చెక్ పోస్టుల్లో సిబ్బందిని మరింత అప్రమత్తం చేయాలన్నారు. అనంతరం ఎస్పీ మాధవరెడ్డి చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. లాకప్ గదులు, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించారు. విజుబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. మహిళా పోలీసులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు స్టేషన్‌కు తెలియజేయాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ కంజాక్షన్, సీఐలు రియాజ్ అహమ్మద్, వేణుగోపాల్, సీసీ రాఘవేంద్ర, సీఐలు వై.శ్రీనివాసులు, వి.శ్రీనివాసులు ఎస్‌ఐ గంగాధర్, సిబ్బంది ఉన్నారు.
అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపండి
సిబ్బందికి ఎస్పీ ఆదేశం
పురం డీఎస్పీ కార్యాలయం తనిఖీ

మహిళా పోలీసులకు సూచనలు చేస్తున్న ఎస్పీ మాధవరెడ్డి