ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు
రాప్తాడు రూరల్: ఉపాధ్యాయ బదిలీల్లో కీలకమైన ఖాళీలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రొవిజినల్ సీనియార్టీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి గురువారం రాత్రి 11 గంటల సమయానికి పూర్తి చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 731 అభ్యంతరాలు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి అర్హత ఉన్నవారికి పాయింట్లను కేటాయించి జాబితాలో చేర్చారు. విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం నుంచే అన్ని జిల్లాల ప్రొవిజనల్ సీనియార్టీ తుది జాబితాలను శనివారం ప్రకటించాల్సి ఉంది. ఖాళీలకు సంబంధించి ఈ ఏడాది మే 31 వరకు ఉన్న ఖాళీలన్నీ వెబ్‌సైట్‌లో పొందు పరుస్తున్నారు. శుక్రవారం రాత్రికి దాదాపు అన్ని యాజమాన్యాల్లోని అన్ని కేడర్లకు సంబంధించి దాదాపు 4,400 ఖాళీలను అప్‌లోడ్ చేశారు. మరో 300 దాకా పెరిగే అవకాశం ఉంది.