ఈ–క్రాప్‌లో అవకతవకలు | Sakshi
Sakshi News home page

ఈ–క్రాప్‌లో అవకతవకలు

Published Sun, Mar 26 2023 1:22 AM

-

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌– 2021 ఈ క్రాప్‌ – నమోదులో అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. బాధ్యులపై చర్యలకు సిఫారసు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఇటీవల ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారన్నారు. 2021 ఖరీఫ్‌లో వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద 2022 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 4 లక్షల మంది రైతులకు రూ.855.55 కోట్ల పరిహారం విడుదల చేసింది. అయితే బీమా మంజూరులో అన్యాయం జరిగినట్లు కొందరు రైతులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఈ–క్రాప్‌ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

భూమి లేకున్నా బీమా..

భూమి లేకున్నా.. పంటలు సాగు చేయకున్నా కొందరు రైతులకు పరిహారం వచ్చిందని గుర్తించారు. మరికొందరు రైతులు ఒక ఎకరాలో పంట సాగు చేస్తే.. రెండు మూడు ఎకరాలు చూపించి ఎక్కువ మొత్తంలో పరిహారం తీసుకున్నట్లు వెల్లడైంది. మరికొన్ని చోట్ల ఒక పంట బదులు మరొక పంటను ఈ–క్రాప్‌లోకి చేర్చడంతో పరిహారం తారుమారైనట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి తప్పిదాలకు పాల్పడిన విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లు, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్లతో పాటు విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్లను బాధ్యులను చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉరవకొండ, మడకశిర, శింగనమల, రాప్తాడు, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, తాడిపత్రి నియోజక వర్గాల పరిధిలో 70 మంది రైతులకు భూమి లేకున్నా, పంట వేయకున్నా పరిహారం వచ్చినట్లు గుర్తించారు. మరో 13 మంది రైతుల పంటల సాగు విస్తీర్ణం బాగా పెంచి చూపించినట్లు గుర్తించి... అందుకు బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

అనర్హులకు పంటల బీమా వర్తింపు

అర్హులకు విస్తీర్ణం తగ్గించి అన్యాయం

వీఏఏలు, వీహెచ్‌ఏలు, వీఎస్‌ఎస్‌లు,

వీఆర్‌ఏలే బాధ్యులు

శాఖాపరమైన చర్యలకు

సిఫార్సు చేసిన వ్యవసాయ శాఖ

Advertisement
Advertisement