సైదాపురం: కేరింతలతో వినాయకుడి గ్రామోత్సవం జరుగుతున్న వేళ ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో ఓ వ్యక్తిపై యువకుడు కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండల కేంద్రమైన సైదాపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై దుర్గాప్రసాద్ కథనం మేరకు.. సైదాపురం బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి గణేశ్ విగ్రహాంతో ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. ఆ సమయంలో యువకులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేస్తున్నారు. ఈ క్రమంలో పలవారి వెంకీ కాలిని డేగా మహేష్ తొక్కడంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. నా కాలు తొక్కుతావా అంటూ వెంకీ ఆగ్రహించి మహేష్‌పై కత్తితో దాడి చేశాడు. కడుపు భాగంలో రెండు అంగుళాల మేర గాయమైంది. బాధితుడు ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేశామని ఎస్సై గురువారం వెల్లడించారు.
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
వాకాడు: వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. విగ్రహ నిమజ్జనం అనంతరం సముద్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన గురువారం మండలంలోని తూపిలిపాళెం తీరంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కొండాపురం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో భక్తులు విగ్రహ నిమజ్జనం కోసం తూపిలిపాళెం తీరానికి చేరుకున్నారు. నిమజ్జనం అనంతరం సముద్రంలో ఉండగా గ్రామానికి చెందిన వాకాటి హర్షవర్ధన్ అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా శరీరంపై తీవ్రమైన నొప్పి, మంట ఏర్పడింది. గమనించిన స్నేహితులు వెంటనే అతడిని వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో నిమజ్జనానికి వచ్చిన భక్తుల్లో ఆందోళన నెలకొంది.


