కూటమి దుర్నీతి పాలనలో జెడ్పీ చరిత్రలో చీకటి రోజు | - | Sakshi
Sakshi News home page

కూటమి దుర్నీతి పాలనలో జెడ్పీ చరిత్రలో చీకటి రోజు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

కంటతడి పెట్టిన అరుణమ్మ

నెల్లూరు (పొగతోట): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిషత్‌కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. ఉద్ధండులైన, కాకలు తీరిన రాజకీయ యోధుల పాలనా దక్షతలో ఇప్పటి వరకు 31 మంది జెడ్పీ చైర్మన్లుగా, చైర్‌పర్సన్లుగా జిల్లా అభివృద్ధిలో బహుముఖ పాత్రపోషించి ప్రజల మన్ననలు అందుకున్నారు. 31వ పాలకవర్గంలోని 47 మంది జెడ్పీటీసీలందరూ వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన వారే. టీడీపీ అధికారంలోకి వచ్చాక.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌ చైర్మన్లను, మండల పరిషత్‌ అధ్యక్షులను పదవుల నుంచి దించేసి.. తమ గుప్పెట్లోకి తీసుకున్నారు. అయితే ఒక్క జెడ్పీ పాలక వర్గాన్ని మాత్రం కదిలించలేకపోయారు. మొత్తం వైఎస్సార్‌సీపీ పాలకవర్గం కావడంతో అధికారులు సైతం జిల్లా పరిషత్‌ ప్రాతినిధ్య ప్రగతిలో సహాయ నిరాకరణ చేస్తూ వచ్చారు.

మూకుమ్మడిగా గైర్హాజరై అవమానం

ఈ పాలకవర్గ పదవీకాలంలో చిట్టచివరి సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించారు. సంప్రదాయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరై పాలకవర్గానికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ. అయితే జెడ్పీ సీఈఓ నుంచి కలెక్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ స్థానికంగానే ఉన్నప్పటికీ సమావేశానికి ఉద్దేశ పూర్వకంగానే గైర్హాజరై పాలకవర్గాన్ని ఘోరంగా అవమానించారు. ఇది జెడ్పీ చరిత్రలో అధికార పార్టీ దుర్నీతి పాలనతో మాయని మచ్చగా మిగిలిపోయింది.

జెడ్పీటీసీలకు అవమానం

నెల్లూరు(పొగతోట): గతంలో ఎన్నడూ లేని విధంగా జెడ్పీ చరిత్రలో ప్రస్తుత పాలకవర్గానికి అవమానం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన ఈ అవమానం చీకటి రోజుగా నిలిచిపోనుంది.

అందరూ కలిసికట్టుగా గైర్హాజరు

సమావేశానికి ఒకరో.. ఇద్దరో రాలేదంటే దానిపై ఎవరికీ సందేహాలు రావు. అయితే ఎవరో చెప్పిన రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇలా ఉద్దేశపూర్వకంగా హాజరుకాలేదు. ఉదయం 10.30కు ప్రారంభం కావాల్సిన మీటింగ్‌కు వివిద శాఖల జిల్లా అధికారులు, 35 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య సెలవులో ఉన్నారు. ఉదయం 11.30 అయినా సీఈఓ వసుమతి, కలెక్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలెవరూ హాజరుకాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు, అమాత్యులు హాజరుకాకపోవడాన్ని అవమానంగా భావించి అరుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు. అధికారులు రాకపోవడమేమిటని జెడ్పీటీసీ ప్రశ్నించారు. సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఇలా వ్యవహరించారానని నిలదీశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. మూకుమ్మడిగా హాజరుకాకపోవడం జెడ్పీటీసీలను అవమానించేందుకేనానని ప్రశ్నించారు. అనంతరం సమీక్షను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు ప్రారంభించారు. ఆపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డిని వేదికపైకి ఆహ్వానించారు.

ఇలా జరగడం దురదృష్టకరం

జిల్లా రాజకీయాలెప్పుడూ హుందాగా ఉంటాయని, అయితే జెడ్పీ చివరి సమావేశం ఇలా జరగడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. అందరికీ అనుకూలంగా పారదర్శకంగా పాలనను జెడ్పీ చైర్‌పర్సన్‌ సాగించారని కొనియాడారు. ఉన్నతాధికారులెవరూ హాజరుకాకపోవడం ఆమెను అవమానించడమేనన్నారు. జెడ్పీ సమావేశం అంటే అంత చులకనానని, ఇలాంటి పరిణామాలను జిల్లా చరిత్రలో ఎప్పుడూ చూడలేదని చెప్పారు. అన్ని రోజులు ఒకేలా ఉండవనే అంశాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, జెడ్పీటీసీలకు అండగా నిలుస్తారని పేర్కొన్నారు.

అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

ఐదేళ్ల పదవీ కాలంలో జిల్లా వ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. జెడ్పీ నిధులు రూ.37.82 కోట్లతో 955.. 15వ ఆర్థిక సంఘ నిధులు రూ.59.16 కోట్లతో 1255 పనులను చేపట్టి పూర్తి చేశామని వెల్లడించారు. రూ.62 కోట్లతో సీపీడబ్ల్యూ మరమ్మతులను చేపట్టడంతో పాటు జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టామని గుర్తుచేశారు. జెడ్పీ స్థలంలో ఉన్న పెట్రోల్‌ బంకు అద్దె నెలకు రూ.39,229 ఉండగా, దాన్ని రూ.2,14,583కు పెంచిన అంశాన్ని ప్రస్తావించారు. రూ.ఐదు కోట్ల విలువజేసే జెడ్పీ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని.. ఆవరణలో అతిథిగృహాన్ని నిర్మించామని వెల్లడించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించడంతో పాటు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, వినికిడి యంత్రాలను అందజేశామన్నారు. రూ.49,83,278తో పదో తరగతి విద్యార్థులకు విజయదీపిక స్టడీ మెటీరియళ్లను అందజేశామని పేర్కొన్నారు. 258 మందికి ఉద్యోగోన్నతులు.. 123 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలను కల్పించామని గుర్తుచేశారు.

జెడ్పీ పాలకవర్గం చిట్టచివరి సమావేశం కావడంతో 20 రోజుల ముందే అందరి అనుమతి తీసుకుని గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. చైర్‌ పర్సన్‌తోపాటు 35 జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కోఆప్షన్‌ సభ్యులు హాజరయ్యారు. సంప్రదాయంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ను సీఈఓ లేదా కలెక్టర్‌ వేదికపైకి ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించాలని కోరాల్సి ఉంది. అయితే సీఈఓ నుంచి ప్రజాప్రతినిధుల వరకు గైర్హాజరు కావడంతో కలువాయి జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి చైర్‌పర్సన్‌ను వేదికపైకి ఆహ్వానించాల్సి వచ్చింది. సమావేశం ప్రారంభమయ్యాక పాలకవర్గం మొత్తం అధికారులు, ప్రజాప్రతినిధులను తీరును గర్హిస్తూ.. వాకౌట్‌ చేసి కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ దుర్నీతి పాలనపై దుమ్మెత్తి పోశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 30 మంది జెడ్పీ చైర్మన్లుగా పని చేశారని, 31వ చైర్‌పర్సన్‌గా తనకు, తన పాలక వర్గానికి అధికార పార్టీ తీవ్ర అవమానం చేసిందని కన్నీరు పెట్టుకున్నారు. ఇటువంటి అవమానకర సంఘటన గతంలో ఎప్పుడు జరగలేదన్నారు. వంటింటి మహిళగా ఉన్న తనను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టి పట్టం కట్టారని, అయితే టీడీపీ ప్రభుత్వం తనను, తమ పాలకవర్గాన్ని అవమానించడం యావత్‌ మహిళా లోకాన్నే అవమానించినట్లేన్నారు. గౌరవంగా వీడ్కోలు చెప్పాల్సిన చివరి సమావేశంలో అవమానించడం సరైన పద్ధతి కాదన్నారు. నెల్లూరు జిల్లా జెడ్పీ చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ ఇటువంటి పరిణామాలను చూడలేదన్నారు.

మూకుమ్మడిగా అధికారులు,

ప్రజాప్రతినిధుల గైర్హాజరు

వైఎస్సార్‌సీపీ పాలకవర్గమనే

ఘోరంగా అవమానించిన

వైనమంటూ విమర్శలు

చిట్టచివరి జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కన్నీరు పెట్టిన జెడ్పీ చైర్‌పర్సన్‌

ఘనంగా వీడ్కోలు పలకాల్సిన సీఈఓ, కలెక్టర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగానే డుమ్మా

సమావేశాన్ని వాకౌట్‌ చేసి..

నేలపై కూర్చొని జెడ్పీటీసీల నిరసన

మహిళా సాధికారత దిశగా రాష్ట్రాన్ని నడిపించాలనే ఆలోచనతో స్థానిక సంస్థల్లో అతివలకు 50 శాతం అవకాశం కల్పించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఇలాంటి గొప్ప అవకాశం కల్పించిన ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు. అనంతరం జెడ్పీటీసీలు అనిల్‌కుమార్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, రామకృష్ణ సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డికి

కృతజ్ఞతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement