పాలనపై బాబుకే నమ్మకం లేదు | - | Sakshi
Sakshi News home page

పాలనపై బాబుకే నమ్మకం లేదు

Sep 18 2026 12:09 AM | Updated on Sep 18 2026 12:09 AM

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

చిల్లకూరు: పాలనపై సీఎం చంద్రబాబుకే నమ్మకం లేకుండాపోయిందని, దీంతో ఒకసారి చెప్పిన మాటను మరోసారి చెప్పలేక అవస్థ పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. గూడూరు పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్లో పార్టీ నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ సమన్వయకర్త బూదూరు గురవయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కాకాణి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ యోచించిన నాటి నుంచి చంద్రబాబులో భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. రెండేళ్లుగా పింఛన్ల ఊసెత్తని ఆయన ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారని, ఆయనలో దాగున్న భయం దీని ద్వారా తెలుస్తోందని విమర్శించారు. వీటి మంజూరుకు బడ్జెట్లో పెట్టి ఆపై ఇస్తామని చెప్పడాన్ని చూస్తుంటే లక్షలాది మందికి మరోసారి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారనే విషయం తెలుస్తోందన్నారు. రైతులంటే చంద్రబాబుకు చులకన అని, నేడు కరువు పరిస్థితులు చుట్టుముట్టినా, శ్రీశైలంలో ఉన్న నీటిని జిల్లాకు కేటాయించేలా కనీస చర్యలు చేపట్టడంలేదని మండిపడ్డారు. 27 నెలల పాలనలో ఒక్క గృహం, బిల్లును మంజూరు చేయలేదని, అయితే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 92 శాతం మంది లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తుంటే, తప్పించుకొని తిరుగుతున్నాయని దుయ్యబట్టారు

పాఠశాలను కొనసాగించలేరా..?

కోటలో ఎన్నో ఏళ్లుగా ఉన్న గురుకుల పాఠశాలను ఎత్తేయడంపై ఆమరణ దీక్ష చేస్తానని పట్టుబట్టాల్సిన స్థానిక ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌.. అలా కాకుండా లేఖలు రాస్తున్నానని చెప్పడం దారుణమన్నారు. అమరావతి నిర్మాణానికి భారీగా ఖర్చు చేస్తున్న చంద్రబాబు.. ఇక్కడ పాఠశాలను యథాతథంగా ఉంచేందుకు రూ.రెండు కోట్లు వెచ్చించలేరానని ప్రశ్నించారు. ప్రతి పల్లెలో సచివాలయం, హెల్త్‌ క్లినిక్‌, ఆర్బీకేలు తమ ప్రభుత్వ హయాంలో బ్రాండ్‌లా కనిపించేవని, అయితే వీటిని ప్రస్తుతం నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. జగనన్నకు ప్రతి కార్యకర్తా అండగా ఉండేలా కొత్త ప్రణాళికలతో గూడూరులో కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. అధికారులు, అధికార పార్టీ నేతలు భయపెట్టాలని చూస్తే, దానికి బదులు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జగనన్న ఆశీస్సులతో గురవయ్యను ఎంపిక చేశారని, నియోజకవర్గంలో కార్యాలయాన్ని త్వరలో ఏర్పాటు చేసి, ప్రతి నెలా ఒక కార్యక్రమాన్ని చేపట్టి ముందుకెళ్తామని ప్రకటించారు. అనంతరం గురవ య్య మాట్లాడారు. నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన వారి అక్రమాలు, అకృత్యాలు, దోపిడీలు పెరిగిపోతున్నాయని, వీటిని అడ్డుకునేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. దళితుడ్నని ఎమ్మెల్యే చెప్తూనే.. వారిపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను కాకాణి చేతుల మీదుగా అందజేశారు. పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, యద్దల మధుసూదన్‌రెడ్డి, ఏనుగు సుధాకర్‌నాయుడు, ఎస్‌ఈసీ సభ్యుడు వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, చిల్లకూరు జెడ్పీటీసీ మన్నెం శీనయ్య, మైనార్టీ నేతలు మగ్దూమ్‌, సుభాన్‌, నాయకులు నాశిన నాగులు, జయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపం

నెల్లూరు రూరల్‌: ఎల్‌నినో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల కంటే ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపంగా పరిణమించిందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. పార్టీ జిల్లాల అధ్యక్షులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ను పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించారు. ఏప్రిల్‌ 22న నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశం నాటికి సోమశిలలో 58.. కండలేరులో 35 టీఎంసీలుండగా, మొదటి పంటకు సాగునీటిని పూర్తి స్థాయిలో అందించలేదని కాకాణి చెప్పారు. 1.8 లక్షలెకరాలకు నీరిచ్చి 64 టీఎంసీలను వృథా చేశారని తెలిపారు. సోమశిల, కండలేరుకు శ్రీశైలం నుంచి జలాలను తరలించే అవకాశమున్నా, సర్కార్‌ చర్యలు చేపట్టలేదని వివరించారు. నీటి విడుదల కోసం రైతులతో కలిసి నెల్లూరు బ్యారేజీ వద్దకెళ్లగా, అడ్డుకొని అక్రమ కేసులను మోపారని తెలిపారు. పశుగ్రాస కొరతతో పశువులను అమ్ముకొని కూలీ పనుల నిమిత్తం రైతులు వలసెళ్లే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై సమీక్ష నిర్వహించిన జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement