● ఆటోను ఢీకొన్న బైక్
● ఇద్దరు యువకుల మృతి
● తీవ్రంగా గాయపడిన మరొకరు
● శోకసంద్రంలో కుటుంబసభ్యులు
బుచ్చిరెడ్డిపాళెం: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన పట్టణ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఓ వైన్ షాపు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని చెల్లాయపాళేనికి చెందిన వీరేంద్ర (18), దినేష్ (20), పట్టణానికి చెందిన సంతోష్ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఆటోను ఢీకొన్నారు. దీంతో వీరేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన దినేష్‌ను 108లో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. సంతోష్‌ను ప్రైవేట్ వాహనంలో బుచ్చిరెడ్డిపాళెంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదా న్ని నింపింది. పిల్లల భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పె ట్టుకున్న తల్లిదండ్రులకు తీరని వేదనను మిగిల్చింది. విషయం తెలిసిన వెంటనే బంధువులు, స్నేహితులు ఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. కాగా ప్రమాదం అనంతరం ఆటోడ్రైవర్ పరారయ్యారు. సమాచారం అందుకున్న సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్సై ఉమాశంకర్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలస్యంగా 108 రాక
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలను స్థానికులు చేపట్టారు. అయితే 108 సకాలంలో రాలేదని ఆరోపించారు. ఫలితంగా క్షతగాత్రులను సకాలంలో తరలించలేని పరిస్థితి ఏర్పడింది. యువకుల మృతితో చెల్లాయపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


