నెల్లూరు(వేదాయపాళెం): నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి పాలకమండలిలో ముగ్గురు డైరెక్టర్లు ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్న తరుణంలో ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించనున్నామని ఎన్నికల అధికారి హరిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పదవిలో ఉన్న 15 మంది డైరెక్టర్లలో ముగ్గురు పదవీ విరమణ పొందనున్నారని వివరించారు. నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీ చేయనున్నామని.. నామినేషన్లను 21వ తేదీ ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించి.. అదే రోజు పరిశీలించనున్నామని వివరించారు. ఉపసంహరణకు మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు సమయముంటుందని చెప్పారు. ఎన్నిక అనివార్యమైతే ఈ నెల 27వ తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించి.. అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నామన్నారు. వెంకటేశ్వరపురంలోని నెల్లూరు డెయిరీ మీటింగ్ హాల్లో నిర్వహించనున్నామని.. అర్హత, ఓటు హక్కు గల సంఘాల అధ్యక్షులను మాత్రమే అనుమతించనున్నామని.. గుర్తింపు కార్డులను తప్పక తీసుకురావాలని కోరారు.
సత్ప్రవర్తనతో శిక్ష తగ్గింపు
ఆత్మకూరు: క్షణికావేశంలో నేరాలు చేసి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న వారు సత్ప్రవర్తన కలిగి ఉంటే శిక్ష తగ్గేందుకు అవకాశం ఉందని జిల్లా లోక్ అదాలత్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. పట్టణంలోని సబ్ జైలును స్థానిక కోర్టు సీనియర్ సివిల్ జడ్జి గాయత్రి, లోక్‌అదాలత్ సభ్యుడు సుబ్బారెడ్డితో కలిసి గురువారం సందర్శించారు. జైల్లోని అన్ని విభాగాలను పరిశీలించి ఖైదీలతో మాట్లాడారు. బెయిల్ రాకుండా పలు కేసుల్లో జైళ్లలోనే నెలల తరబడి ఉంటున్న ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా సాయాన్ని అందించనున్నామని వివరించారు. రూ.మూడు లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న వారు దీన్ని పొందేందుకు అర్హులని చెప్పారు. జైలు జీవితం అనంతరం ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని పేర్కొన్నారు. భోజన వసతిపై ఆరాతీశారు. జైలర్ అశోక్, సిబ్బంది రమణయ్య, సుమతి, వేణు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
కస్తూరిదేవి విద్యాలయ
కరస్పాండెంట్‌గా రమణారెడ్డి
నెల్లూరు (టౌన్): కస్తూరిదేవి విద్యాలయాల ఎగ్జిక్యూటివ్, కరస్పాండెంట్‌గా గణపం రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రయ్య ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండోమెంట్ ఈఓగా, సర్వోదయ కళాశాల కరస్పాండెంట్‌గా ఈయన విధులు నిర్వర్తిస్తున్నారు. కస్తూరిదేవి ఆస్తులు, విద్యాలయాల పరిరక్షణపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈయన నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో కస్తూరిదేవి విద్యాలయ నిర్వహణాధికారి భాస్కర్‌రెడ్డికి లేఖను అందజేశారు. ఆస్తులు, విద్యాలయాలకు సంబంధించిన రికార్డులను అప్పజెప్పాలని పేర్కొన్నారు. కాగా కస్తూరిదేవి విద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జీవీకే స్కూల్ సైతం ఎండోమెంట్ పరిధిలోకి రానుందని తెలుస్తోంది.
శ్రీవారి దర్శనానికి
నాలుగు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 71,196 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 22,581 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.2.24 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


