● కట్టుబట్టలతో మిగిలిన
గిరిజన కుటుంబాలు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని జంగాలకండ్రిగ గ్రామంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ఇరిగేషన్ కాలువ గట్టు సమీపంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు బాధితులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో గిరిజనులకు చెందిన మూడు పూరిగుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో మూడు కుటుంబాలకు చెందిన సుమారు పదిమంది కట్టుబట్టలతో మిగిలారు. దుస్తులు, వంట సామగ్రి, గృహోపకరణాలతోపాటు పిల్లల పుస్తకాలు పూర్తిగా కాలిపోయాయి. రూ.25 వేల నగదు కూడా మంటల్లో దగ్ధమైనట్లు బాధిత కుటుంబాలు తెలిపారు. ప్రస్తుతం నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుని తక్షణ సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.


