సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్స్ జిల్లా యూనియన్ నాయకులు జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరీనా, ఉమా మాట్లాడుతూ ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఆశా వర్కర్లకు సరైన గుర్తింపు, వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని విధానం, నెలసరి సెలవులు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల పోస్టులను పెంచి ఖాళీలను భర్తీ చేయాలని, పని భారం తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ధనమ్మ, ఏ. సుజాత, ఎస్. పెంచలమ్మ, సుజనా పాల్గొన్నారు.


