దగదర్తి: మండలంలోని ఐతంపాడులో ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించి.. జామాయిల్‌తో పాటు ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఒక్కొక్కరూ సుమారు పదెకరాలకు తగ్గకుండా చదును చేసి సాగు జరుపుతున్నా, సంబంధిత రెవెన్యూ అధికారులకు ఏ మాత్రం పట్టడంలేదు. ఫలితంగా అర్హులకు ల్యాండ్స్ అందని ద్రాక్షలా మారుతోంది. నిజానికి గ్రామంలోని సర్వే నంబర్ ఒకటిలో సుమారు 29 ఎకరాల అనాధీన.. సర్వే నంబర్ నాలుగులో సుమారు 150 ఎకరాల మేత పొరంబోకు భూమి ఉంది. వీటితో పాటు చెరువు పొరంబోకు, దేవదాయ శాఖ ల్యాండ్స్ సైతం ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు నివాసముంటున్నా, వీరిలో భూమిలేని వారే ఎక్కువగా ఉన్నారు. రాజకీయ, అధికార పలుకుబడి ఉన్నవారు పెద్ద ఎత్తున ఆక్రమించి చదును చేసి సాగు చేస్తున్నారు. గ్రామంలో వందెకరాలకుపైగా భూములు 25 మంది కబంధహస్తాల్లో చిక్కుకున్నాయని గతంలో రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో తేల్చారు. కబ్జాదారులను హెచ్చరించినా, పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోవడం గమనార్హం.


