పెద్దాస్పత్రిలో ఎక్స్‌రే సేవలకు విఘాతం | - | Sakshi
Sakshi News home page

పెద్దాస్పత్రిలో ఎక్స్‌రే సేవలకు విఘాతం

Jul 24 2026 1:27 AM | Updated on Jul 24 2026 1:27 AM

డిజిటల్‌ రీడర్‌ దొంగలపాలు

అవస్థలు పడుతున్న రోగులు

సేవలను పునరుద్ధరించాలని డిమాండ్‌

నెల్లూరు (అర్బన్‌): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డిజిటల్‌ ఎక్స్‌రేకు సంబంధించిన డిజిటల్‌ రీడర్‌ (డీఆర్‌)ను సుమారు రెండున్నర నెలల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ సేవలు రోగులకు అందడం లేదు. ఏకంగా డీఆర్‌ గదికి తాళం వేశారు. ఈ విషయమై దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌లో అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. మాన్యువల్‌గా ఎక్స్‌రే సేవలు అందిస్తున్నప్పటికీ డిజిటల్‌ ఎక్స్‌రే సేవలు నిలిచిపోవడంతో ఆ విభాగంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో రోగులకు సకాలంలో సేవలు అందడం లేదు.

120 నుంచి 150 మంది వరకు..

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత సంవత్సరమే వైద్యశాఖ అధికారులు డిజిటల్‌ ఎక్స్‌రే మెషీన్‌ను ఏర్పాటు చేశారు. ఇది నాణ్యమైన ఎక్స్‌రే సేవలను అందించే యంత్రం. జిల్లా వ్యాప్తంగా సర్వజన ఆస్పత్రికి (పెద్దాస్పత్రి) వచ్చే రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడేది. రోజుకు కనీసం 120 నుంచి 150 మంది వరకు ఎక్స్‌రేలు తీస్తుంటారు. డిజిటల్‌ మెషీన్‌తోపాటు మరో రెండు మాన్యువల్‌ ఎక్స్‌రే మెషీన్లు కూడా ఉన్నాయి. మాన్యువల్‌గా తీయాలంటే క్యాసెట్లు ఉండాలి. ఎక్స్‌రే తీసిన తర్వాత వాటిని మళ్లీ సాధారణ రీడర్‌లో ఉంచిన తర్వాతే చిత్రం కనిపిస్తుంది. ఇందువల్ల సమయం ఎక్కువ పడుతుంది. పైగా అంత నాణ్యత కూడా ఉండదు. డిజిటల్‌ ఎక్స్‌రేలో అయితే నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఫొటో తీసిన భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. క్యాసెట్లు కూడా అవసరం ఉండదు. కొత్తగా డిజిటల్‌ మెషీన్‌ను ఏర్పాటు చేసినప్పటికీ తక్కువ కాలంలోనే దానికి సంబంధించిన డీఆర్‌ దొంగతనానికి గురైంది. అది లేకపోతే ఎక్స్‌రే తీసినా చిత్రం కనిపించదు.

దొంగలెవరో..

డిజిటల్‌ డీఆర్‌ అనేది చిన్న పరికరం. పెన్‌డ్రైవ్‌ కంటే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీని ఖరీదు కూడా సుమారు రూ.2 లక్షలు. డీఆర్‌ రూములో టెక్నీషియన్‌ మాత్రమే ఉంటారు. అయినప్పటికీ దొంగతనం జరిగింది. దీంతో అప్పటి నుంచి డిజిటల్‌ ఎక్స్‌రే సేవలు నిలిచిపోయాయి. చోరీ జరిగిన రోజు విధుల్లో ఉన్న వారిని పోలీసులు విచారించాల్సి ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలి. అనుమానితులను ప్రశ్నించాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా అనే ప్రచా రం కూడా జరుగుతోంది. ఎవరో చేసిన తప్పునకు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పక్కాగా విచారణ జరిపి డీఆర్‌ను రికవరీ చేయించాలి. లేకుంటే కొత్త డీఆర్‌ను కొనుగోలు చేసి డిజిటల్‌ ఎక్స్‌రే సేవలను పునరుద్ధరించాలని రోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement