● 50 ట్రాక్టర్లలో లేఅవుట్‌కు తరలింపు
● విలేకరులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు
ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కొండను తవ్వి గ్రావెల్‌ను టిడ్కో గృహాల సమీపంలోని ఓ వెంచర్‌కు గురువారం అక్రమంగా తరలించారు. సుమారు 50 ట్రాక్టర్లలో 23వ వార్డు నెల్లూరుపాళేనికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ తంతు జరిగింది. కాగా నెల్లూరుపాళెంలోని టీడీపీకి చెందిన మరో వర్గం వారు ఆ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విలేకరులు ఘటనా స్థలానికి చేరుకుని వీడియోలు తీస్తున్నారు. మాదాల హరీష్ నాయుడు, మాదాల విష్ణు నాయుడు అనే టీడీపీ నేతలు ఓ విలేకరిని అడ్డుకుని సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల కు మామూళ్లిచ్చి వారి అనుమతితో గ్రావెల్ తరలిస్తున్నామని ఏమి చేసుకుంటారో, చేసుకోండంటూ బెదిరించారు. ఓ విలేకరిని నెట్టేయడంతో అతని చొక్కా చినిగింది. దీంతో పలువురు జర్నలిస్టులు ఎస్సై జంపాని కుమార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ రవాణాదారులు ట్రాక్టర్లను గంటల వ్యవధిలో ఘటనా స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు.
ఉత్తరకాలువ గట్టు నుంచి..
కలిగిరి: కలిగిరి – కొండాపురం మార్గంలో చిన్నచెరువు సమీపంలో హెచ్‌పీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న సోమశిల ఉత్తరకాలువ గట్టు నుంచి అనుమతి లేకుండా గురువారం టిప్పర్ల ద్వారా గ్రావెల్ తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమశిల కెనాల్ ఏఈ మధుసూదన్ గ్రావెల్ తరలింపును నిలిపి వేస్తామని చెప్పినప్పటికీ ఆగలేదు. కలిగిరి చిన్నచెరువులో నుంచి కూడా రాత్రి టిప్పర్లు తిరిగాయి. కలిగిరి సమీపంలో మాగాణి పొలాలకు రోడ్డు వేయడానికి గ్రావెల్‌ను తరలిస్తున్నారు.


