● ఏడాది తిరగకుండానే
సైన్స్ అధికారి బదిలీ
● ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే
కొత్త వ్యక్తికి డిప్యుటేషన్
● మంత్రి నారాయణ ఒత్తిడితోనే అంతా..
● గతంలో ఎన్నడూ లేని విధంగా
సరికొత్త సిత్రాలు
నెల్లూరు (టౌన్): వడ్డించే వ్యక్తి మనోడైతే బంతి చివర కూర్చున్నా, అన్ని సమకూరుతాయనే సామెత జిల్లా విద్యాశాఖకు చక్కగా సరిపోతుంది. ఎలాంటి ఆరోపణల్లేకపోయినా, ఏడాది తిరగకుండానే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా సైన్స్ అధికారిని నియమించారు. మంత్రి నారాయణ ఒత్తిడితో ఆగమేఘాలపై ఇలా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలు తుంగలో..
వాస్తవానికి సైన్స్ అధికారి నియామకానికి గానూ నోటిఫికేషన్‌ను జిల్లా విద్యాశాఖ జారీ చేయాల్సి ఉంది. పాఠశాలలో సంబంధిత సబ్జెక్ట్‌కు రెండో టీచర్ ఉన్నప్పుడే జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్ వేయాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఇలాంటివేవీ లేకుండానే అనంతసాగరం మండలం జే కాలనీలోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మూర్తిని డిప్యుటేషన్‌పై నియమించారు. ఇంత హడావుడిగా మార్చడంపై జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే, వారు నోరే మెదపడం లేదు. ఇదే అంశం విద్యాశాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఏడాదిలో ఎంతో మంచి పేరు
విడవలూరు మండలం రామతీర్థం జెడ్పీ హైస్కూల్లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్న శివారెడ్డిని జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్‌పై గతేడాది ఆగస్ట్ 14న నియమించారు. ఈయన వచ్చాక సైన్స్ కేంద్రాన్ని అభివృద్ధి చేశారని ఉపాధ్యాయులే చెప్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో జిల్లా సైన్స్ కేంద్రానికి ఉత్తమ అవార్డూ లభించింది. దాదాపు 17 వేల మందికిపైగా విద్యార్ధులు కేంద్రాన్ని సందర్శించారు. తిరుపతి. ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచీ స్టూడెంట్స్ వచ్చారు. ఈ పరిణామాల క్రమంలో విజయకుమార్ ట్రస్ట్ నుంచి కేంద్రానికి ఒక బస్సును ఉచితంగా అందజేశారు. దీని ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులను రోజూ తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు.
అనుకున్నారు.. మార్చేశారు..!
సాధారణంగా జిల్లా సైన్స్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తేనో.. లేదా రెండేళ్లు పూర్తి చేసుకున్నారనే కారణంతో బదిలీ చేస్తుంటారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే మార్చేశారు. కాగా మూర్తి పనిచేస్తున్న జే కాలనీలోని స్కూల్లో రెండో టీచర్ లేరు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు.
అమాత్యుడు పట్టుబట్టడంతోనే..
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒత్తిడితోనే జిల్లా సైన్స్ అధికారిని మార్చారనే విమర్శలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి. మూర్తి నియామక విషయమై కలెక్టర్‌పై బాగా ప్రెజర్ చేశారని తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ మేరకు డీఈఓను కలెక్టర్ ఆదేశించారని సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రంలో నోడల్ అధికారిగా మూర్తి గతంలో పనిచేశారు. పాఠశాలకు సక్రమంగా వెళ్లారని.. జిల్లా కేంద్రానికే ఎక్కువ భాగం పరిమితమవుతారని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తుండటం విశేషం.
ఇన్నేళ్లనే ఆర్డర్ ఉండదు
జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్‌పై వచ్చిన వ్యక్తికి ఇన్నేళ్లనే ఆర్డరేమీ ఉండదు. ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంటుంది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పు చేశాం.
– బాలాజీరావు, డీఈఓ
తాను గతంలో అయ్యోరినేనంటూ ఎక్కడ అవకాశం లభిస్తే.. అక్కడ మంత్రి నారాయణ చెప్తుంటారు. ఇప్పటికీ అదే అనుకున్నారో.. ఏమో.. గానీ తాజాగా ఆయన పెత్తనం విద్యాశాఖపై పడింది. ఈ విమర్శలకు బలం చేకూరుస్తూ ఏకంగా సైన్స్ అధికారినే బదిలీ చేయించి.. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్‌ను కల్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. అనంతసాగరం మండలంలోని జే కాలనీలో ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న జేవీఆర్ మూర్తిని ఈ స్థానంలో నియమించారు. ఈ పరిణామాల క్రమంలో సదరు స్కూల్లో పీఎస్ ఉపాధ్యాయుడే కరువయ్యారు.


