రీ సర్వేను వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేను వేగవంతం చేయండి

Jul 23 2026 12:13 AM | Updated on Jul 23 2026 12:13 AM

సంగం: జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన ఆయన రీ సర్వే పురోగతిపై సమీక్షించారు. రికార్డులు, మ్యాపులు, సాంకేతిక వివరాలను పరిశీలించారు. పనుల్లో పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార చర్యలపై వివరాలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 690 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే దశల వారీగా సాగుతోందని చెప్పారు. 2024కు ముందు 314 గ్రామాల్లో పూర్తయిందని, మిగిలిన ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉందన్నారు. పూర్తయిన గ్రామాల రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, వచ్చే నెల మొదటి వారానికి మరో విడత పూర్తి కానుందని వెల్లడించారు. సాంకేతిక పొరపాట్లు అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయని, వీటిని వెంటనే సరిదిద్దేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. తొలుత స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్‌ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ట్రాన్స్‌పోర్టు కనెక్ట్‌ యాప్‌లో నమోదు చేయాలి

నెల్లూరు (టౌన్‌): రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మారిటైమ్‌ బోర్డు, యూనిఫైడ్‌ లాజిస్టిక్స్‌ ఇంటర్‌ ఫేస్‌ ప్లాట్‌ఫామ్‌ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఏపీ ట్రాన్స్‌పోర్టు కనెక్ట్‌ యాప్‌లో వాహన యజమానుల వివరాలు నమోదు చేసుకోవాలని డీటీసీ చందర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు, ఫ్లీట్‌ ఓనర్లు, ఇతర రవాణా సంస్థలను ఒకే డిజిటల్‌ లాజిస్టిక్స్‌ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. జాతీయ లాజిస్టిక్స్‌ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సౌలభ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశమన్నారు. ఏపీ ట్రాన్స్‌పోర్టు కనెక్ట్‌ యాప్‌లో లారీ నంబర్‌, ఓనరు పేరు, అడ్రస్‌, మొబైల్‌ నంబర్‌, డ్రైవరు పేరు తదితర వివరాలను నమోదు చేసుకోవడం ద్వార భవిష్యత్తులో డిజిటల్‌ సేవలు, వేగవంతమైన ధ్రువీకరణ, తక్కువ పేపర్‌ వర్క్‌, సులభమైన సమాచార మార్పిడి, విస్తృత వ్యాపార అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని లారీ యజమానులు, ట్రాన్స్‌పోర్టు సంస్థలు, ఫ్లీట్‌ ఓనర్లు, అన్ని రంగాల వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు transportconnect. ap.gov.inను సంప్రదించాలని సూచించారు.

నేటి నుంచి ఐటీఐ

రెండో విడత ప్రవేశాలు

నెల్లూరు (టౌన్‌): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐల్లో రెండో విడత ప్రవేశాల కోసం గురువారం నుంచి వచ్చే మూడులోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఐటీఐలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను వచ్చే నెల నాలుగున చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఐటీఐలో ఆరున.. ప్రైవేట్‌ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌కు ఎనిమిదిన హాజరుకావాలని కోరారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ కళాశాలను సంప్రదించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement