వ్యవసాయ బోర్ల తొలగింపు అమానుషం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బోర్ల తొలగింపు అమానుషం

Jul 18 2026 9:51 AM | Updated on Jul 18 2026 9:51 AM

వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా

అధ్యక్షుడు పందిటి కామరాజు

కలిగిరి: ‘తెల్లపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూనిపోగు ఇర్మియాకు చెందిన రెండు వ్యవసాయ బోర్లను తొలగించడం అమానుషం. బాధ్యులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు తెలిపారు. ఇర్మియాకు న్యాయం చేయాలంటూ కలిగిరిలోని తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇర్మియా కుటుంబం 60 ఏళ్లుగా తెల్లపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 522/2లో 2.80 పట్టా భూమిలో వ్యవసాయం చేస్తోందన్నారు. 15 సంవత్సరాల క్రితం ఇంటి వద్ద వ్యవసాయ పనులు, పశువుల కోసం బోరు వేయించారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్సార్‌ జలకళ పథకంలో ఉపాధి హామీ ద్వారా బోరు వేసి మోటార్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి ఉందని కొందరితో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేయించారన్నారు. వారు స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో ఇర్మియా సాగు చేస్తున్న భూమిలో రెండున్నర సెంట్లు ఆక్రమణలో ఉందని, అందులో బోరు ఉందని చెబుతూ తొలగించడం సమంజసం కాదన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ దగ్గరుండి ఇర్మియాపై ఫిర్యాదు చేసిన వ్యక్తి, ఇతర టీడీపీ నాయకులతో రెండు బోర్లను తొలగించడం దుర్మార్గమన్నారు. ఈ చర్యపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లకు ఫిర్యాదులు చేస్తామన్నారు. న్యాయ పోరాటం జరుపుతామన్నారు.

● ఇర్మియా మాట్లాడుతూ డిప్యూటీ తహసీల్దార్‌ తమ ఇంటికి వచ్చి బోర్లు తొలగించకుండా ఉండాలంటే స్థానిక టీడీపీ నాయకులు, ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలని ఒత్తిడి చేశారన్నారు. తలొగ్గకపోవడంతో ఉద్దేశపూర్వకంగా బోర్లు తొలగించారన్నారు. వరిపంట సాగులో ఉందని నీరు ఇవ్వకపోతే ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్తే వరి పంట సాగు పూర్తయే వరకు అధికారులు ఇబ్బందులు పెట్టరని హామీ ఇచ్చారన్నారు. ఈ మాటలను కూడా స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ కాటం రవీంద్రారెడ్డి మాట్లాడుతూ కలిగిరికి కిలోమీటర్‌ దూరంలో సుమారు 13 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఇతర ప్రాంతాల వారి పేర్లకు ఎలా మార్చారో, కలిగిరిలో సమీపంలో ఐదు సెంట్ల భూమిని అసలు యజమానికి తెలియకుండా ఇద్దరి పేర్ల మీదకు ఎలా మార్చారో వివరాలతో కలెక్టర్‌ను కలుస్తామన్నారు. ఇర్మి యా పొలంలో బోరు, మోటార్‌ ఏర్పాటుకు వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, యువనేత మేకపాటి అభినవ్‌రెడ్డి సొంత నిధులు అందిస్తామని భరోసా ఇచ్చారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షుడు ఒంగోలు రాఘవేంద్ర, జిల్లా కార్యదర్శి దావులూరి వెంకటేష్‌, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు యలపల తిరుపాలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement