నెల్లూరు(అర్బన్): ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వారికి కేటాయించిన విధులను పక్కాగా నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ సుజాత అన్నారు. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఆశా నోడల్ ఆఫీసర్స్ సమీక్షను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు టీనేజ్ ప్రెగ్నెన్సీలను నివారించాలని, కిశోర బాలికల ఆరోగ్యం పెంపొందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఇన్‌చార్జి డీఐఓ డాక్టర్ బ్రిజిత మాట్లాడుతూ మాతా–శిశు సంరక్షణ చర్యలను ఎప్పటికప్పుడు ఆర్సీహెచ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ఐదేళ్లలోపు పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయించడం, బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వంద శాతం వేసేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి(డీసీహెచ్‌ఎస్) డాక్టర్ పరిమళ మాట్లాడుతూ ఏంటినేటల్ కేసులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి డెలివరీలు చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎన్‌ఎంఓ డాక్టర్ రమేష్, స్టాటిస్టికల్ ఆఫీసర్ సహాన, డీపీఓ రమేష్, డీసీఎం సునీత పాల్గొన్నారు.


