● కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● డీసీపల్లి పొగాకు బోర్డు ఎదుట రైతుల ధర్నా
మర్రిపాడు: పొగాకు పంటకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. డీసీపల్లి పొగాకు బోర్డులో పొగాకు రైతుల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. గిట్టుబాటు ధరలు, వేలం ప్రక్రియలోని సమస్యలపై చర్చించారు. అనంతరం పొగాకు బోర్డు కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ గతేడాది వేలం ప్రక్రియను కిలో పొగాకు గరిష్ట ధర రూ.280తో ప్రారంభించగా, రూ.360 వరకు అమ్ముడు పోయిందని తెలిపారు. ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులను కారణంగా చూపుతూ రూ.250తో కొనుగోళ్లను ప్రారంభించి రూ.190కు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కిలో పొగాకు ధరను రూ.250కు తగ్గించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పొగాకు బోర్డు ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు గడిచినా కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. ప్రతిరోజూ కేవలం 100 నుంచి 150 బేళ్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా వేలం సాగితే రైతుల పొగాకు ఉత్పత్తుల అమ్మకాల ప్రక్రియ మళ్లీ సంవత్సరం వరకు సాగుతుందన్నారు. ఇప్పటికే సుమారు 25 శాతం పొగాకు పంట దెబ్బతిందన్నారు. ఫస్ట్ గ్రేడ్ పొగాకు నాణ్యత తగ్గి మూడు, నాలుగు గ్రేడ్లకు పడిపోవడంతో ఒక్కో బేలుపై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు రైతులకు నిధులను కేటాయించి ఆదుకుందన్నారు. అలాగే కూటమి ప్రభత్వం కూడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కిలో పొగాకుకు రూ.30, రాష్ట్ర ప్రభుత్వం రూ.20 చొప్పున పరిహారం చెల్లిస్తే రైతులకు కొంత ఊరట లభిస్తుందన్నారు. రైతుల పక్షాన ఉండాల్సిన పొగాకు బోర్డు సూపరింటెండెంట్ కూడా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు లక్కు ప్రసాద్, పొగాకు బోర్డు రైతు సంఘం అధ్యక్షుడు గాలి నరసపనాయుడు, ఆత్మకూరు ఏఎంసీ చైర్మన్ జనార్దన్, రైతు నాయకుడు చండ్ర రాయణస్వామి, క్లస్టర్ సభ్యులు గంగినేని రవీంద్రబాబు, వెంకటేశ్వర్లురెడ్డి, ఓబులురెడ్డి, శ్రీనాథ్, ఆరికట్ల పుల్లయ్య, గుర్రం నాగేశ్వరరావు, మాలేపాటి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.


