నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా, రోడ్డును ఆక్రమించి అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను కమిషనర్ నందన్ సోమవారం పరిశీలించారు. ఈ నెల 23, 24 తేదీల్లో ‘సాక్షి’లో ప్రచురితమైన ‘రూ.2 కోట్ల స్థలం హాంఫట్’, ‘అవినోటు అంతస్తులు’ వరుస కథనాలనూ స్పందించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న బహుళ అంతస్తుల భవనం, ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని ఉడ్‌హౌస్ సంఘం ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి అక్రమంగా నిర్మించిన దుకాణాలను పరిశీలించారు. వీటిపై ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులను ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. బృందావనంలో అనుమతి లేకుండా నిర్మించిన భవన నిర్మాణ యజమానికి నోటీసు జారీ చేయడంతో పాటు ఆ ప్రాంత సచివాలయ ప్లానింగ్ సెక్రటరీకి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు.
వైఎస్సార్‌సీపీ అనుబంధ కమిటీల నియామకం
విడవలూరు: వైఎస్సార్‌సీపీ జిల్లా అనుబంధ విభాగాల్లో కోవూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమించినట్లు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు విభాగ ప్రధాన కార్యదర్శిగా వావిళ్ల రమణ య్య, పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శిగా సిగి నం సుబ్రహ్మణ్యం, బీసీ సెల్ కార్యదర్శిగా అంగా ఫకీరయ్య, టీయూసీ విభాగ కార్యదర్శిగా తంబు వెంకటేశ్వర్లు, ఇంటెలెక్చువల్ విభాగ కార్యదర్శిగా వేణుంబాక మహీధర్‌రెడ్డి, వలంటీర్ విభాగ కార్యదర్శిగా నాయుడు సురేష్, గ్రీవెన్స్ సెల్ కార్యదర్శిగా సిగినం శ్రీనివాసులు, బూత్ కమిటీ కార్యదర్శిగా గోపసాని పెంచలయ్యను నియమించినట్లు వివరించారు. నూతనంగా పార్టీ అనుబంధ విభాగాల్లో నియమితులైన వారు కోవూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


