నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం జిల్లాకు ఆరు పీహెచ్‌సీలు మంజూరు చేసింది. అందులో అనంతసాగరం మండలంలోని రేవూరు/బొమ్మవరం పీహెచ్‌సీకి రూ.2.70 కోట్లు మంజూరు చేసి నిర్మాణ ప్రక్రియను ఆర్‌అండ్‌బీకి కేటాయించింది. అలాగే బోగోలు మండలం జువ్వలదిన్నె, గుడ్లూరు మండలం చేవూరు, మర్రిపాడు మండలం కృష్ణాపురం, ముత్తుకూరు మండలం తాళ్లపూడి పీహెచ్‌సీలకు ఒక్కోదానికి రూ.1.93 కోట్ల చొప్పున మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటి నిర్మాణ ప్రక్రియను ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా చేపట్టనున్నారు.
ఈత పండ్ల కోసం వెళ్లి..
● నీటి మడుగులో పడి బాలుడి మృత్యువాత
చేజర్ల: ఈత పండ్లు కోసుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని మడపల్లె గ్రామంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మడపల్లికి చెందిన గుండుబోయిన సాంబయ్య, వెంగమ్మ దంపతుల కుమారుడు చంద్రశేఖర్ (16) పదో తరగతి పాసయ్యాడు. త్వరలో ఇంటర్మీడియట్‌లో చేరాల్సి ఉంది. సెలవులు కావడంతో చంద్రశేఖర్ తన చెల్లెలు శ్రావణితో కలిసి గ్రామం సమీపంలో ఉన్న ఈత పండ్ల కోసం వెళ్లాడు. చెట్ల దగ్గరకు వెళ్లే క్రమంలో నీటి మడుగు దాటుతున్నాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉండటంతో ఈతరాని చంద్రశేఖర్ మునిగిపోయాడు. శ్రావణి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చేలోగా చంద్రశేఖర్ మృత్యువాత పడ్డాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
చేపల గుంతల్లో చికెన్ వ్యర్థాలు
● పట్టుకున్న పోలీసులు
కోవూరు: అక్రమంగా చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని సోమవారం సీజ్ చేశారు. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నుంచి భారీగా వ్యర్థాలను బొలెరో వాహనంలో తీసుకొచ్చి రామన్నపాళెం గేట్ సమీపంలోని ఓ ఫ్యాక్టరీ వెనుక భాగంలో ఉన్న గుంతల్లో వేస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. ఇటీవల చైన్నె, బెంగళూరు నుంచి వచ్చే వాహనాలపై తనిఖీలు కఠినతరం కావడంతో అక్రమార్కులు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రామన్నపాళెం పరిసర ప్రాంతాల్లో కొంతకాలంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వాహనాల రాకపోకలు పెరిగినట్లు చెబుతున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.


