● విద్యాసంస్థల బస్సులకు ముగిసిన ఫిట్‌నెస్‌ | - | Sakshi
Sakshi News home page

● విద్యాసంస్థల బస్సులకు ముగిసిన ఫిట్‌నెస్‌

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

నెల్లూరు (టౌన్‌): విద్యా సంస్థల బస్సులకు సంబంధించి ఫిట్‌నెస్‌ గడువు ఈ నెల 15వ తేదీతో ముగిసింది. ఫిట్‌నెస్‌ ఉంటేనే బస్సులు రోడ్డెక్కాలని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర రవాణాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యా సంస్థల బస్సుల యాజమాన్యాలు ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌కు తెస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న టెస్టింగ్‌ స్టేషన్‌ నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. కండీషన్‌ బట్టి ఒక్కో బస్సుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నారని స్కూల్స్‌ బస్సుల యజమానులే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో మంత్రి నారాయణకు మామూళ్ల బెడద తప్పలేదని తెలుస్తోంది.

ఫిట్‌నెస్‌గా ఉన్నాయా?

జిల్లాలో ఆయా విద్యా సంస్థల బస్సులు 1,145 వరకు ఉన్నాయి. జూనియర్‌ కళాశాలలు జూన్‌ 1వ తేదీ, పాఠశాలలు జూన్‌ 12వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా బస్సులన్నింటికి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంది. జిల్లాలో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ బాధ్యతను ప్రవీణ్‌ ఆథరైజ్డ్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ గతేడాది సెప్టెంబర్‌ నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తోంది. సాధారణంగా వాహనాలను టెస్టింగ్‌ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ అనంతరం రవాణా అధికారులు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అయితే టెస్టింగ్‌ ముందుగానే తనిఖీ చేసి బస్సుల్లో ఉన్న లోపాలను ఆయా యాజమాన్యాలకు తెలియజేయాలని రవాణాశాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆయా ప్రాంతాల్లో 455 విద్యా సంస్థల బస్సులను పరిశీలించి లోపాలను సరిచేసుకోవాలని 352 బస్సులకు రవాణా అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇంకా 690 బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలకు వెళ్లలేదని తెలుస్తోంది. ఈ ఫిట్‌నెస్‌ ప్రక్రియలో బస్సులకు బ్రేక్‌లు పడేటట్లు ఉన్నాయా? అవినీతికి బ్రేక్‌లు పడుతాయా? అనే సందేహంగా మారింది.

ఫిట్‌నెస్‌ నిబంధనలివే

విద్యా సంస్థల బస్సులకు సంబంధించి నామ మాత్రంగా టెస్టింగ్‌ చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. సాధారణంగా బస్సు ఎడమ వైపు స్కూల్‌ పేరు, చిరునామా స్పష్టంగా ఉండాలి. బస్సుకు అత్యవసర ద్వారం ఉండాలి. బస్సులో ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌, అగ్నిమాపక నిరోధక పరికరం ఉండాలి. తలుపులకు సురక్షిత లాకింగ్‌ సిస్టం ఉండాలి బస్సులో విద్యార్థులు ఎక్కడం, దిగడం గమనించడానికి కన్వెక్స్‌ క్రాస్‌ వ్యూ అద్దాలు అమర్చబడాలి. బస్సులో సీట్లు కింద బ్యాగులు ఉంచేందుకు అరలు ఏర్పటు చేయాలి. సైడ్‌ విండోలకు మధ్యలో అడ్డంగా 3 లోహపు కడ్డీలు అమర్చాలి. విద్యాసంస్థకు 10 బస్సులు ఉన్నట్లయితే అదనంగా (స్పేర్‌) బస్సు ఒకటి తప్పనిసరిగా ఉండాలి. బస్సు ఫుడ్‌ బోర్డుపై తొలిమెట్టు భూమి నుంచి 325 మి.మీ.ఎత్తుకు మించి ఉండరాదు.

జిల్లాలో 1145కు గాను

455 బస్సులకు మాత్రమే తనిఖీలు

352 బస్సులకు నోటీసుల జారీ

కండీషన్‌ లేకుండానే రోడ్లపైకి..

ఒక్కో బస్సుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు

ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్ల జారీ

జిల్లాలో ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌ నేతృత్వంలో నడుస్తున్న ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ అవినీతికి కేరాఫ్‌గా మారింది. అడిగినంత ఇస్తే వాహనం ఎట్లా ఉన్నా ఎంచక్కా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారు. గతంలో ఫిట్‌నెస్‌ టెస్ట్‌లు జిల్లా రవాణాశాఖాధికారులు చేస్తుండేవారు. ప్రభుత్వ అధికారులు కావడంతో కొంత బాధ్యతగా వ్యవహరించే వారు. అయితే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్‌ సంస్థకు అప్పగించడంతో వారి ఇష్టారాజ్యంగా మారింది. వాహనం కండీషన్‌ లేకున్నా నామమాత్రపు ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ చేసి సర్టిఫికెట్లను ఇస్తున్నారు.

లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశాం

విద్యా సంస్థల బస్సులకు సంబంధించి ఫిట్‌నెస్‌కు ముందుగానే తనిఖీలు చేయాలని ఉన్నతాఽధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో కావలి, ఆత్మకూరు, గూడూరు పరిసర ప్రాంతాల్లోని స్కూల్స్‌, కళాశాలలకు చెందిన 455 బస్సులను తనిఖీ చేశాం. వాటిల్లో లోపాలను గుర్తించి వాటిని సరిచేసుకోవాలని 352 బస్సులకు నోటీసులు జారీ చేశాం. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ అనంతరం తనిఖీలు చేయాలన్న ఆదేశాలు ఇంకా రాలేదు. ప్రతి బస్సు కండీషన్‌తోనే రోడ్డు ఎక్కాలి.

– ఎండీ మదాని, ఆర్టీఓ

Advertisement
 
Advertisement
Advertisement