పొదలకూరు: పట్టణంలోని గేటుసెంటరు ప్రాంతానికి చెందిన పడ్డాల వేమయ్య (65) మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ దశగా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి చెరువు వద్ద కొందరు శుక్రవారం సాయంత్రం పార్టీ చేసుకున్నట్టు తెలిసింది. దీనికి వేమయ్యను పిలవడంతో వెళ్లాడు. అక్కడికి వచ్చిన వారిలో ఫర్టిలైజర్స్ కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి, నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, పొదలకూరులో వ్యాపారం చేస్తున్న మరో వ్యక్తి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వేమయ్య వెళ్లిన తర్వాత గొడవ జరిగినట్టుగా చెబుతున్నారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన ఒకరిద్దరు కూడా చూశారని తెలుస్తోంది. దీనికితోడు వేమయ్య తలపై గాయాలు ఉండటం వల్ల హత్యగా అనుమానించాల్సి వస్తోందంటున్నారు. అందరికీ సుపరిచితుడైన వేమయ్య మృతదేహం చెరువులో తేలడంపై పట్టణంలో చర్చ జరుగుతోంది.
రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్
నెల్లూరు సిటీ: కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వుల మేరకు వేదాయపాళెం పోలీసులు రౌడీషీటర్ షేక్ రసూల్‌పై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆ స్టేషన్ పరిధిలో బుజబుజనెల్లూరులో నివాసం ఉంటున్న రసూల్‌పై గతంలో ఒక హత్య, నాలుగు హత్యాయత్నం, మూడు కొట్లాట, రెండు దోపిడీ కేసులున్నాయి. ఆదివారం అతడిని నెల్లూరు జిల్లా జైలు నుంచి కడప జైలుకు తరలించారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత మాట్లాడుతూ జిల్లాలో హత్యలు, దోపిడీలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్‌లు ప్రయోగిస్తామన్నారు.
రైలు ఢీకొని వృద్ధుడి మృతి
నెల్లూరు సిటీ: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య 65 – 70 సంవత్సరాల మధ్య వయసున్న వృద్ధుడు పట్టాలు దాటుతున్నాడు. ఈ సమయంలో రైలు ఢీకొంది. వృద్ధుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బులుగు రంగు చొక్కా, గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. చేతి కర్ర ఉంది. రెండు మోకాళ్లకి క్యాపులు ధరించి ఉన్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేశారు.
చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
● వాహనాల పట్టివేత
వెంకటాచలం: చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న రెండు వాహనాలను వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద పోలీసులు ఆదివారం ఉదయం పట్టుకున్నారు. టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేస్తుండగా.. చైన్నె వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న రెండు వాహనాలను ఆపి పరిశీలించారు. అందులో చికెన్ వ్యర్థాలు ఉన్నట్లుగా గుర్తించారు. వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
కదులుతున్న
రైలు ఎక్కబోయి..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిల్లకూరు(గూడూరుటౌన్): గూడూరు రైల్వే స్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై కదులుతున్న రైలు ఎక్కబోయి జారి పడి గాయాలపాలైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. భువనేశ్వర్ నుంచి తిరుపతికి వెళుతున్న రైలు గూడూరు స్టేషన్‌కు ఆదివారం ఉదయం ఆరు గంటలకు చేరుకుంది. సుమారు 48 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి దిగాడు. రైలు కదులుతున్న సమయంలో పరుగెడుతూ ఎక్కే క్రమంలో కాలు జారి రైలు, ప్లాట్‌ఫారానికి మధ్యలో పడిపోయాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడిని ఒడిశా వాసిగా చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రిలో ఉంచారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 90,011 మంది స్వామిని దర్శించుకున్నారు. 39,083 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 18 గంటలు, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


