● సవాల్ విసురుతున్న మట్టి,
గ్రావెల్ మాఫియా
● ఇష్టారాజ్యంగా చెరువులో తవ్వకాలు
చిట్టమూరు: మండల పరిధిలోని మొలకలపూడి చెరువులో ఆదివారం కూడా కూటమి నాయకులు అక్రమంగా గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని ఆయకట్టు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంత తంతు జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడకపోవడం విమర్శలకు తావిస్తుంది. చెరువులో రెండు యంత్రాలు పెట్టి టిప్పర్లకు నింపి సాగరమాల రోడ్డుకు తోలుకుని సొమ్ము చేసుకుంటున్నారు. మట్టిని చెరువు తూముల కంటే లోతుకు ఎత్తి వేయడంతో చెరువులోని సాగునీరు పొలాలకు పారే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొలకలపూడి చెరువు గొలుసుకట్టు చెరువు. దీని కింద నాలుగైదు చెరువులకు నీరు సరఫరా అవుతుంది. ఈ విషయంపై గ్రామ వీఆర్వో భక్తవత్సలరెడ్డిని వివరరణ కోరగా చెరువులో గ్రావెల్, మట్టి తోలకాలకు ఎటువంటి అనుమతుల్లేవన్నారు.
ఆపేవారే లేరా?
మండలంలో కూటమి నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులపై ఒత్తిళ్లు తెస్తూ మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. ఆలయాల నిర్మాణాల పేరు చెప్పి చెరువుల్లో మట్టిని అమ్ముకుని జేబులు నింపుకొంటున్నారు. చెరువు కట్టలపై ఉన్న కలపను కూడా నరికి అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు.


