● అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలింపు
● అడ్డుకున్న కృష్ణపట్నం గ్రామస్తులు
● పోలీసుల పంచాయితీ
ముత్తుకూరు(పొదలకూరు): అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు ఎక్కడపడితే అక్కడ మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారు. ప్రశ్నించిన వారిని బెదిరించడంతోపాటు అక్రమంగా కేసులు పెడుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే వారు లేరనే విమర్శలున్నాయి. మండలంలోని కృష్ణపట్నం గ్రామంలో శనివారం అర్ధరాత్రి ట్రాక్టర్లలో మట్టిని అక్రమంగా తరలిస్తుండగా పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. ముఖ్యనేతల అండదండలతోనే మట్టిని తరలిస్తున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. అయితే మట్టి మాఫియా పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి పంచాయితీ చేశారు. అలాగే మాట వినని గ్రామస్తులను బెదరగొట్టి ట్రాక్టర్లను విడిపించి పంపారు. మట్టి తరలింపును అడ్డుకోవాల్సిన పోలీసులే ఇలా చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాక్టర్ మట్టి డిమాండ్‌ను బట్టి రూ.1,200 నుంచి రూ.1,500 వంతున అమ్ముకుంటున్నట్టు తెలుస్తోంది. జేసీబీకి ఇందులో ట్రిప్పునకు రూ.200 వంతున చెల్లిస్తున్నారు. ఇందుకోసం ఎవరి వద్ద ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదు. కలెక్టర్, ఎస్పీ చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


