● ఉదయగిరి ఎమ్మెల్యేపై ఆగ్రహం
కొండాపురం: ‘దళితులపై దాడి చేసి, ఒక వ్యక్తిని హత్య చేసి బావిలో వేసిన వారిపై ఇప్పటికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మాకు ఏం న్యాయం చేశారు’ అని గానుగపెంట ఎస్సీ కాలనీకి చెందిన జడ రసూల్, హజరత్ కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను నిలదీశారు. రసూల్ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆదివారం కావలి నుంచి గానుగపెంటకు తీసుకొచ్చారు. పరామర్శకు వచ్చిన సురేష్‌పై కాలనీ వాసులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పార్టీని నమ్మి ఓట్లు వేసి గెలిపించినందునందుకు తగిన శాస్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రసూల్‌ను తమ గ్రామ టీడీపీ నాయకుడు కిలారి నరేంద్ర తీసుకెళ్లి దగ్గరుండి వారి చేతుల్లో పెట్టి హత్య చేయించాడని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రసూల్, హజరత్‌పై దాడి చేసిన 15 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపాలని కోరారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దామా మహేశ్వరరావుపై కూడా కాలనీవాసులు ఆగ్రహించారు. ఊరికి ఒక యువ నాయకుడి పేరుతో రౌడీయిజం చేయిస్తున్నావని.. నీ వల్లే మండలం హత్యాకాండలతో మారు మోగిపోతుందని.. మండలంలో కనిపిస్తే నీ అంతు చూస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రెండు, మూడు రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రసూల్ కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సహాయం చేశారు.


