రైతులకు నో.. తమ్ముళ్లకు రయ్‌ రయ్‌ | - | Sakshi
Sakshi News home page

రైతులకు నో.. తమ్ముళ్లకు రయ్‌ రయ్‌

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

పోలీసులు, అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం

చిట్టమూరు: మండల పరిధిలోని అరవపాళెంలో సామాన్య రైతులు తమ పొలాలకు మట్టిని తోలి చదును చేసుకునేందుకు ప్రయత్నించగా శనివారం పోలీసులు, అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పక్కనే టీడీపీ నేతలు చెరువులో హిటాచీ పెట్టి మట్టిని వారి పొలాలకు తోలుకుంటుంటే మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఏమిటని రైతులు పోలీసులను నిలదీశారు. మట్టి తోలకాలు ఆపితే అందరివీ అడ్డుకోవాలని, లేకుండా తమనూ తోలనివ్వాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో తమ పొలాలు ముంపునకు గురై వరి పంటలు సక్రమంగా పండకపోవడంతో పొలానికి మట్టిని తోలి లెవలింగ్‌ చేసుకుందామని ప్రయత్నించగా అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి చిట్టమూరు పోలీసులు, అధికారులు తమను అడ్డుకున్నారని వాపోయారు. తాము మట్టి తోలకముందే తీసుకొచ్చిన జేసీబీను పోలీస్‌స్టేషన్‌కు తలించాలని, లేకుంటే కేసులు పెట్టి జైల్లో వేస్తామని పోలీసులు బెదిరింపులకు దిగారని తెలిపారు. రైతులు ఎంత మొత్తుకున్నా పోలీసులు తమ మాట వినకుండా అధికార పార్టీ నేతల మాటలు విని తాము తెప్పించుకున్న జేసీబీను మాత్రం స్టేషన్‌కు తరలించాలని బెదిరింపులకు దిగారన్నారు. మరోపక్క అధికార టీడీపీ నేతల మట్టి తోలకాలు యథావిధిగా జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వారికి పర్మిషన్లు ఉన్నాయని వారి తరఫున అనుకూలంగా చెబుతూ సామాన్య రైతులను భయభ్రాంతులకు గురి చేయడంతో వారు చేసేది లేక వెనుదిరిగారు. కూటమి ప్రభుత్వంలో సామాన్య రైతు నుంచి, వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల వరకు కక్ష సాధింపు చర్యలు ఎక్కువైపోయాయన్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో సామాన్య రైతులపై టీడీపీ నేతల దౌర్జన్యాన్ని ఆపాలని కోరుతున్నారు.

చెరువులో యథేచ్ఛగా సాగుతున్న టీడీపీ నేతల మట్టి తోలకాలు

సామాన్య రైతులు తెచ్చుకున్న జేసీబీని అడ్డుకున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement