కార్పొరేట్‌కు దీటుగా పది ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు దీటుగా పది ఫలితాలు

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా పదో తరగతి ఫలితాలు సాధించడం అభినందనీయమని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ అన్నారు. జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో జెడ్పీ పాఠశాలల్లో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 11 మంది విద్యార్థులు, వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్‌ఎంలను శనివారం సన్మానించారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులకు చైర్‌పర్సన్‌ అభినందనలు తెలిపారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. 22 జెడ్పీ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ విజయకుమార్‌, డీఈఓ బాలాజీరావు, జెడ్పీటీసీలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చెట్టుకు ఉరేసుకుని

వ్యక్తి ఆత్మహత్య

బుచ్చిరెడ్డిపాళెం: బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంతోష్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.

కల్లేరు వాగులో

గుర్తుతెలియని మృతదేహం

చిల్లకూరు: గూడూరు రూరల్‌ సంతదాసుపల్లి సమీపంలోని కల్లేరు వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రూరల్‌ ఎస్సై తిరుపతయ్య తన సిబ్బందితో కలిసి వాగులో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించి పరిశీలించారు. సుమారు మూడ్రోజుల క్రితం మృతిచెంది నీటిలో ఉండడం వల్ల గుర్తుపట్టలేని విధంగా మారిందని, మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి శరీరంపై నల్ల ప్యాంట్‌ మాత్రమే ఉందని, ఎలాంటి గాయాల్లేవన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement