కల్యాణం.. కమనీయం | - | Sakshi
Sakshi News home page

కల్యాణం.. కమనీయం

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

కనుల పండువగా మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు

ఆకట్టుకున్న ఎదుర్కోలు ఉత్సవం

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

మారుమోగిన శివనామస్మరణ

బుచ్చిరెడ్డిపాళెం: మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి కల్యాణ మహోత్సవం భక్త జనుల కనుల పండువగా శనివారం జరిగింది. మండలంలోని జొన్నవాడలో కొలువైన కామాక్షితాయి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా సాగింది. జిల్లాతో పాటు ప్రకాశం, తిరుపతి, కడప, తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించారు. ముందుగా స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలు, పట్టు వస్త్రాలు, ముత్యాల హారాలు, రత్న కిరీటాలతో విశేషంగా అలంకరించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదఘోష మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఒక వైపు స్వామివారి తరఫున, మరో వైపు అమ్మవారి తరఫున వేద పండితులు ఎదురెదురుగా నిలబడి లీలగా సాగించిన సంవాదం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. ప్రతి ఘట్టానికి భక్తులు హర్షధ్వానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మండపంలో స్వామి అమ్మవార్లను అధిష్టించి అర్చకులు వేద పారాయణాల మధ్య ఆది దంపతుల కల్యాణ విశిష్టతను భక్తులకు వివరిస్తూ అర్చకులు కమనీయంగా నిర్వహించారు. జీలకర్ర బెల్లం, మంగళసూత్రధారణ, తలంబ్రాల ఘట్టాల సమయంలో ఆలయ ప్రాంగణం శివనామస్మరణలతో మారుమోగిపోయింది. హర హర మహాదేవ, ఓం నమఃశివాయ నినాదాలతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. విశిష్ట అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్ల దివ్య మంగళ స్వరూపాలను చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. కళ్యాణ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కల్యాణంలో వినియోగించిన తలంబ్రాలను తీసుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ఉభయ దాతలు, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు, దేవదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement