● ఏటా వేలాది మందికి వ్యాప్తి
● అధికారిక లెక్కల్లో మాత్రం
పదుల సంఖ్యలోనే..
● నేడు జాతీయ డెంగీ నివారణ దినోత్సవం
నెల్లూరు(అర్బన్): డెంగీ జ్వరం వస్తే రోగి నీరసించిపోతాడు. ఆస్పత్రి పాలవుతారు. ఆర్థికంగా నష్టపోతారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి పెద్ద మృతి చెందితే ఆ కుటుంబం వీధిన పడుతోంది. అందువల్ల డెంగీని నివారించేందుకు కేంద్రం నడుం బిగించింది. మే నెల 16వ తేదీని జాతీయ డెంగీ నివారణ డేగా ప్రకటించి వైద్యశాఖ ద్వారా ప్రజలను చైతన్యం చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో శనివారం వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు, అవగాహన సదస్సులు జరుగనున్నాయి.
నిల్వ నీటిలో దోమల ఉధృతి
డెంగీ వ్యాధి ప్రధానంగా ఏడిస్ ఈజిప్టె అనే రకం దోమ కాటు వల్ల వస్తుంది. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉండే స్వచ్ఛమైన నీటిలో ఈ దోమలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి ద్వారా విస్తృతమవుతాయి. కూలర్లు, పాతటైర్లు, కొబ్బరి చిప్పలు, పూలకుండీలు, నీటి ట్యాంకుల్లో నిల్వ ఉండే నీటిలో ఈ దోమలు ఆవాసంగా ఉంటాయి.
వైద్యశాఖ కాకి లెక్కలు
వైద్యశాఖ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో జిల్లాలో కేవలం 37 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాయి. 2026 జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగున్నర నెలల కాలంలో 21 కేసులు మాత్రమే నమోదైనట్టు లెక్కలు రాశారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులు, కార్పొరేట్ ఆస్పత్రులను పరిశీలిస్తే గత సంవత్సరం సుమారు 4 వేలకు పైగానే డెంగీతో రోగులు చికిత్స పొందినట్టు తెలుస్తోంది. ఉదాహరణకు శంకరాగ్రహారంలోని ఒక ప్రజా వైద్యశాలను పరిశీలిస్తే గత సంవత్సరం 400 వరకు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇలా మిగతా ఆస్పత్రుల్లో కూడా డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఆగస్టు నుంచి జనవరి మధ్య కాలంలో ఈ కేసులు ఉధృతంగా నమోదవుతున్నాయి. డెంగీ కేసులు ఎక్కువగా రాపూరు, కలువాయి, ఉదయగిరి, సీతారామపురం లాంటి అటవీ ప్రాంతాల గ్రామాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి.
ప్రైవేటు ఆస్పత్రుల కేసులు లెక్కల్లో లేవు
వైద్యశాఖ ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాత్రమే ఎలీసా పద్ధతిలో రక్త పరీక్షలు చేయించుకోవాలి. వాటిలో పాజిటివ్ వస్తేనే డెంగీగా నిర్ధారిస్తున్నారు. అయితే డెంగీ నిర్ధారణ పరీక్షలు పీహెచ్‌సీలలో లేవు. ఇందువల్ల అనేక కేసులు నమోదు కావడం లేదు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేసే స్ట్రిప్ పద్ధతి పరీక్షలను వైద్యశాఖ ఒప్పుకోవడం లేదు. పైగా డెంగీ అని చెప్పకూడదంటూ వైద్యశాఖ ప్రైవేటు ఆస్పత్రులకు ముందుగానే హెచ్చరికలు పంపుతోంది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు డెంగీ కేసులు నమోదైనప్పటికీ తమకెందుకులే అని చెప్పడం లేదు. ఫలితంగా వైద్యశాఖ చెప్పే కాకిలెక్కలను మాత్రమే నమ్మాలట.
నివారణ చర్యలు
ప్రధానంగా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఏ కొంచెం నీరు కూడా నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి కిటికీలకు మెస్‌లు ఏర్పాటు చేసుకోవాలి. దోమతెరలు, దోమల నివారణ క్రీములు వినియోగించాలి. ప్రతి వారం క్రమం తప్పకుండా నీటి ట్యాంకులను శుభ్రపరుచుకోవాలి.
పరిశుభ్రత పాటిద్దాం..
డెంగీని దూరం చేద్దాం
వైద్యశాఖ తీసుకున్న చర్యల ఫలితంగా కొన్నేళ్లుగా జిల్లాలో డెంగీ కేసులు దాదాపు కనుమరుగయ్యాయి. అక్కడక్కడా కొన్ని కేసులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇలా డెంగీ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రత పాటించాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి. తద్వారా డెంగీని దూరం చేయాలి.
– డాక్టర్ అన్షుధర్, జిల్లా మలేరియా నివారణాధికారి
డెంగీ లక్షణాలు
అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, కళ్ల వెనుక భాగంలో నొప్పి, వాంతులు, నీరసం లాంటివి ఉంటే డెంగీగా అనుమానించి పరీక్షలు చేయించుకోవాలి. చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడితే అది ప్రమాద సంకేతం. కడుపులో నొప్పి, మలవిసర్జన రంగు నలుపులో ఉంటే ఇది అత్యంత ప్రమాదకరమైన లక్షణం. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.


